eknath shinde: ఉద్ధవ్​ థాకరే కాదు.. ఏక్​నాథ్​ షిండేనే శివసేన లీడర్​.. 34 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్​కు లేఖ

  • మహారాష్ట్రలో గంట గంటకు మారుతున్న పరిణామాలు
  • తమదే అసలైన శివసేన శాసనసభాపక్షం అంటూ గవర్నర్ కు రెబెల్ ఎమ్మెల్యేల లేఖ
  • పార్టీ చీఫ్ విప్ గా భరత్ గొగవాలేను నియమించుకున్నట్టు వెల్లడి
rebel leader eknath shinde steps it up 34 mlas write to governor backing him

మహారాష్ట్రలో రాజకీయాలు గంట గంటకూ మలుపు తిరుగుతున్నాయి. క్యాంపునకు వెళ్లిన తిరుగుబాటు ఎమ్మెల్యేలలో నితిన్ దేశ్ ముఖ్, మరొకరు తిరిగి రావడం.. ఇంకా ఎమ్మెల్యేలు వచ్చేస్తారన్న ప్రచారంతో.. మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం నిలబడినట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర గవర్నర్ కు, డిప్యూటీ స్పీకర్ కు రాసిన లేఖ మళ్లీ సంచలనానికి కారణమైంది.

మాదే అసలైన శివసేన శాసనసభా పక్షం
ఉద్ధవ్ సర్కారుపై షిండే తిరుగుబాటు చేయగానే ఆయనను శాసనసభా పక్ష నేత హోదా నుంచి తొలగిస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. కానీ తమదే అసలైన శివసేన శాసనసభా పక్షం అంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు గవర్నర్ కు లేఖ రాశారు. 

‘‘శివసేన పార్టీకి మహారాష్ట్ర శాసనసభలో మొత్తం 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 34 మందిమి ఏక్ నాథ్ షిండే వెనుకే ఉన్నాం. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోంది. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు. అందుకే తిరుగుబాటు చేస్తున్నాం. అసెంబ్లీలో శివసేన మాదే. ఏక్ నాథ్ షిండే శాసనసభా పక్ష నేతగా కొనసాగుతారు. పార్టీ చీఫ్ విప్ గా భరత్ గొగవాలేను నియమించుకున్నాం” అని పేర్కొన్నారు.

శివసేన ఆదేశాలు చెల్లవు: ఏక్ నాథ్ షిండే 
పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నామని.. దానికి హాజరుకాకుంటే పార్టీని వీడినట్టుగా భావిస్తామన్న శివసేన ఆదేశాలు చెల్లబోవని తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. తమదే అసలైన శివసేన అని ఆయన పేర్కొన్నారు.

More Telugu News