Naresh: ఇలాంటి సమయంలో సినీ కార్మికులు సమ్మెకు దిగడం సరికాదు: సీనియర్ నటుడు నరేశ్

  • డిమాండ్ల సాధన కోసం సినీ కార్మికుల సమ్మె
  • వేతనాలు పెంచాలంటూ ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం ముట్టడి
  • కరోనా సంక్షోభం వల్ల పరిశ్రమ నష్టపోయిందన్న నరేశ్
  • ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని వెల్లడి
Naresh responds on cine labor protests

టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మెకు దిగడంపై సీనియర్ నటుడు నరేశ్ స్పందించారు. ఒకట్రెండు యూనియన్లకు చెందిన కార్మికులు సమ్మె చేస్తున్నారని వెల్లడించారు. వేతనాలు పెంచకపోతే షూటింగులు ఆపేస్తామని పోరాటం చేస్తున్నారని తెలిపారు. డిమాండ్ల కోసం పోరాడడం మంచిదేనని, దీనిపై ఇండస్ట్రీలో పెద్దలు చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. 

అయితే దాదాపుగా మూడేళ్లుగా కరోనా వల్ల సినీ రంగం కూడా తీవ్ర నష్టపోయి అట్టడుగుకు పడిపోయిందని తెలిపారు. కార్మికులు, చిన్న ఆర్టిస్టులు పూట గడవక నానా ఇబ్బందుల పడ్డారని, వైద్య ఖర్చులు కూడా లేకుండా ప్రాణాలు విడిచిన ఘటనలు జరిగాయని నరేశ్ వివరించారు. 

ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయని, వెంటిలేటర్ పై ఉన్న చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంటోందని, సినిమాలు విడుదలవుతున్నాయని వివరించారు. తెలుగు సినిమాకు మంచి పేరొస్తోందని, బ్యాంకులు నిండకపోయినా, కంచాలు నిండుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఆకస్మిక సమ్మెకు దిగడం సరికాదని నరేశ్ అభిప్రాయపడ్డారు. 

తనకు నిర్మాతలు, దర్శకులు, నటులు, కార్మికుల నుంచి ఫోన్లు వస్తున్నాయని, ఇలాగైతే మొత్తం మునిగిపోతామండీ అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. 

"ఇండస్ట్రీ బిడ్డగా చెప్పేదొక్కటే. కరోనా సమయంలో సినిమాలు ఆగిపోయి చిత్ర నిర్మాతలు వడ్డీలు కూడా కట్టలేక కోట్లల్లో నష్టపోయారు. ప్రస్తుతం సినిమా నిర్మాణం ఊపందుకుంటోంది. ఈ సమయంలో తొందరపడకుండా, వారం పది రోజుల సమయం తీసుకుని, ఇటు ఫెడరేషన్ కి, ఇటు నిర్మాతలకు ఇబ్బంది లేకుండా అందరం చర్చించి ఓ పరిష్కారానికి రావడం కష్టమేమీ కాదు. సినీ పరిశ్రమను మళ్లీ అంధకారంలోకి వెళ్లనివ్వకుండా, షూటింగులు ముందుకు సాగేలా అందరం ఓ అవగాహనకు వద్దాం" అంటూ నరేశ్ సోషల్ మీడియాలో వీడియో సందేశం వెలువరించారు.

More Telugu News