father: పిల్లలపై తండ్రి ఆరోగ్యం, జీవనశైలి ప్రభావం ఉంటాయా?

  • కచ్చితంగా వుంటాయని చెబుతున్న శాస్త్రవేత్తలు
  • యుక్త వయసులో పిల్లలను కనడం మంచిదన్న సూచన
  • వయసు పెరుగుతున్న కొద్దీ జీన్స్ నాణ్యత తగ్గుతుందని గుర్తింపు
  • తండ్రికి ఆరోగ్య సమస్యలు ఉంటే పిల్లలపై ఆ ప్రభావం
Do The Health And Lifestyle Of The Father Affect The Baby Too

పిల్లల ఆరోగ్యంపై తండ్రి ప్రభావం ఏ మేరకు..? ఇదొక ఆసక్తికరమైన ప్రశ్న. చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. సమాధానం తెలుసుకోవాలని ఉంటుంది. శాస్త్రవేత్తలకూ ఆది ఆసక్తికరమైన అంశమే. 

ఫలదీకరణ సమయంలోనే తండ్రి నుంచి జీన్స్ పిండానికి వెళతాయి. సదరు జీన్స్ లో నాణ్యత బేబీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాణ్యత అంటే ఇక్కడ తండ్రి వయసు కీలకం అని చెప్పుకోవాలి. తండ్రి ఎంత యువకుడిగా ఉంటే బేబీకి వెళ్లే జీన్స్ అంత నాణ్యంగా ఉంటాయి. అదే వయసు మీరిన, ఆరోగ్య సమస్యలున్న తండ్రి అయితే పిల్లలకు అందే జీన్స్ అంత ఆరోగ్యకరంగా ఉండవు. 

వయసు పెరుగుతున్న కొద్దీ బేబీలకు వెళ్లే జీన్స్ నాణ్యత తగ్గిపోతుంది. అందుకే చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాలని చెబుతుంటారు. ఒక వ్యక్తి యుక్త వయసులో ఉన్నప్పుడు పాస్ చేసే జీన్స్ కు.. అదే వ్యక్తి 40 ఏళ్లు దాటిన తర్వాత పాస్ చేసే జీన్స్ కు నాణ్యతలో ఎంతో వ్యత్యాసం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. 40 ఏళ్లు దాటిన వయసులో పురుషుడు పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటే, అప్పుడు బేబీలకు ఆటిజం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. 

వ్యక్తుల వీర్య నాణ్యతపై పొగతాగే అలవాటు ప్రభావం చూపిస్తుంది. పొగతాగే అలవాటు వల్ల వారి పిల్లల ఆరోగ్య ప్రొఫైల్ పై తప్పకుండా ప్రభావం పడుతుందన్నది శాస్త్రవేత్తలు తెలుసుకున్న విషయం. మధుమేహం, రక్తపోటు ఇలాంటివి కూడా వంశ పారంపర్యంగా పిల్లలకు సోకేవే. తండ్రికి కేన్సర్ ఉంటే.. వారి పిల్లలకు సైతం భవిష్యత్తులో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.  

తలసీమియా, రక్తానికి సంబంధించి వ్యాధులు సైతం సగానికి సగం తండ్రి నుంచే వ్యాపించడానికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలోని వివిధ భాగాల్లో వెంట్రుకలు అధికంగా మొలిచే హైపర్ ట్రైకోసిస్ సమస్య కూడా తండ్రి నుంచి పిల్లలకు వ్యాపించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 

మానసిక ఆరోగ్యానికి వస్తే.. తండ్రికి డిప్రెషన్ ఉంటే ఆ వ్యక్తికి పుట్టే పిల్లలకు కూడా ఆ సమస్య వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే.. స్థూల కాయం సమస్య తల్లిదండ్రుల్లో ఎవరికి ఉంటే పిల్లలపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది? అంటే, అది కూడా తండ్రి వల్లేనని చెబుతున్నారు. అంటే తల్లికి స్థూల కాయం ఉంటే పిల్లలపై పడే ప్రభావంకంటే.. తండ్రి స్థూల కాయుడు అయితే వచ్చే ప్రభావమే ఎక్కువ. 

పిల్లలతో తండ్రి ఎక్కువ సమయం గడుపుతూ, వారితో మాట్లాడుతూ, ఆడుకోవడం చేస్తే.. చిన్నారులు ఎంతో ఆత్మ విశ్వాసంతో, మెరుగైన విశ్లేషణ సామర్థ్యంలో ఉంటారట. కనుక పిల్లలతో తండ్రి తప్పకుండా సమయం గడపాలన్నది వైద్యుల సూచన.

More Telugu News