Guidelines: కరోనా కేసుల పెరుగుదల... తెలంగాణలో మరోసారి మార్గదర్శకాల జారీ

Guidelines issued in Telangana to tackle corona again
  • తెలంగాణలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా వ్యాప్తి
  • గత కొన్నిరోజులుగా 200కి పైగా కొత్త కేసులు
  • మాస్కులు ధరించాలన్న ప్రభుత్వం
  • భౌతికదూరం తప్పనిసరి అని వెల్లడి
తెలంగాణలో గత కొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా అధికమవుతుండడంతో రాష్ట్రంలో మళ్లీ ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. అంతేకాదు, వ్యాక్సినేషన్ పూర్తిచేయించుకోవడం చాలా ముఖ్యమని స్పష్టం చేసింది. మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.

  • 10 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు తప్పనిసరి అయితేనే బయటికి వెళ్లాలి.
  • 20 నుంచి 50 ఏళ్ల లోపు వారికి కరోనా ఎక్కువ సోకుతుందని వెల్లడైంది కాబట్టి, ఆయా వ్యక్తులు ఉద్యోగాలకు, ఉపాధికి, ఇతర ముఖ్యమైన పనులకు బయటికి వెళ్లేటప్పుడు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఇంటి నుంచి బయటికి వెళ్లే ప్రతిసారి మాస్కులు ధరించాలి. కొవిడ్-19ను ఎదుర్కోవడంలో మాస్కులే మొట్టమొదటి పోరాట యోధులు.
  • మనిషికి మనిషికి మధ్య 6 అడుగుల కంటే ఎక్కువ భౌతిక దూరం పాటించడం అత్యావశ్యకం. ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు భౌతికదూరం తప్పనిసరి.
  • పనిచేసే స్థలాల్లో సబ్బులు, శానిటైజర్లు తప్పకుండా అందుబాటులో ఉంచాలి. చేతులు శుభ్రపరుచుకునేందుకు తగినంత స్థలం కూడా ఏర్పాటు చేయాలి. పనిచేసే చోట ఉద్యోగుల మధ్య భౌతికదూరం తప్పనిసరి.
  • అవసరం లేకుండా ప్రయాణాలు చేయరాదు. ఒకవేళ తప్పనిసరి అయితే మాస్కులు, శానిటైజర్లు దగ్గరుంచుకోవాలి. భౌతికదూరం పాటించాలి.
  • జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కులు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి ఫ్లూ, ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలు ఉంటే దయచేసి మీకు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో తెలియజేయండి. ఆలస్యం చేయకుండా వైద్యసాయం పొందండి.
  • బీపీ, డయాబెటిస్, హృదయ సంబంధిత జబ్బులు ఉన్నవారు, దీర్ఘకాలంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారు, క్యాన్సర్ బాధితులు, లేక ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలి. ఏదైనా వైద్య చికిత్స కోసం తప్ప ఇతరత్రా బయటికి రాకూడదు. వారు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • వాక్సినేషన్ రెండు డోసులు తీసుకోవాలి.

Guidelines
Corona Virus
New Cases
Telangana

More Telugu News