Volunteer: రైతులకు పంట బీమా సొమ్ము ఇప్పించలేకపోయానంటూ తనను తాను చెప్పుతో కొట్టుకున్న వలంటీర్... వీడియో ఇదిగో!

  • రామదాస్ నాయక్ తండాలో వలంటీరుగా చేస్తున్న నగేష్
  • పంట బీమా కోసం రైతులతో ఈ-క్రాప్ బుకింగ్
  • ఒక్క రైతుకే బీమా వచ్చిన వైనం
  • నగేష్ ను నిలదీసిన మిగతా రైతులు
Volunteer hits himself in Sri Sathyasai district

శ్రీ సత్యసాయి జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. రైతులకు పంట బీమా నగదు ఇప్పించలేకపోయానంటూ ఓ వలంటీర్ తనను తాను చెప్పుతో కొట్టుకున్నాడు. ఆ వలంటీర్ పేరు నగేష్ నాయక్. కదిరి మండలం రామదాస్ నాయక్ తండాలో వలంటీర్ గా పనిచేస్తున్నాడు. తన క్లస్టర్ లో 50 మందికి పైగా రైతులు ఉండగా, పంట బీమా ప్రయోజనం కోసం అందరితో ఈ-క్రాప్ బుకింగ్ చేయించాడు. 

అయితే, వారిలో ఒక్కరికే పంట బీమా అందింది. దాంతో, మిగిలిన రైతులు వలంటీర్ నగేష్ పై మండిపడ్డారు. అతడిని వెంటబెట్టుకుని రైతు భరోసా కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఉన్న వ్యవసాయ అధికారిని నిలదీయగా, అతడి నుంచి సరైన సమాధానం కరవైంది. 

ఈ నేపథ్యంలో, వలంటీర్ నగేష్ రైతులకు పంట బీమా ఇప్పించలేకపోయానంటూ మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే చెప్పు తీసుకుని తనను తానే కొట్టుకున్నాడు. ఈ వలంటీర్ ఉద్యోగం వద్దంటూ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

More Telugu News