Manoj Tiwary: ఉదయం క్రికెట్... సాయంత్రం ఆఫీసు పనులు: బెంగాల్ క్రీడల మంత్రి మనోజ్ తివారీ వెల్లడి

Manoj Tiwary opines on his cricket career and ministerial work
  • గత ఎన్నికల వేళ రాజకీయాల్లోకి మనోజ్ తివారీ
  • టీఎంసీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిపదవి చేపట్టిన వైనం
  • బెంగాల్ టీమ్ తరఫున రంజీల్లో ఆడుతున్న తివారీ
  • క్వార్టర్ ఫైనల్లో రెండు సెంచరీలు, సెమీస్ లో ఒక సెంచరీ నమోదు
పశ్చిమ బెంగాల్ క్రీడలమంత్రి మనోజ్ తివారీ ఇటీవల రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ, సెమీఫైనల్లో తొలి ఇన్నింగ్స్ లోనూ సెంచరీ బాది తనలో క్రికెట్ దాహం తీరలేదని చాటుకున్నాడు. గత ఎన్నికల సమయంలో రాజకీయాల్లో ప్రవేశించిన మనోజ్ తివారీ... టీఎంసీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. క్రీడానేపథ్యం ఉండడంతో సీఎం మమతా బెనర్జీ అతడిని రాష్ట్ర క్రీడల మంత్రిగా నియమించారు.

అయితే, మంత్రి అయ్యాక కూడా మనోజ్ తివారీ క్రికెట్ ను వదిలిపెట్టలేదు. మంత్రి పదవి అంటే ఎంతో ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. విపక్షాల నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కొంటూ, పరిపాలన సాగించాల్సి ఉంటుంది. రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, అటు మంత్రి పదవిని, ఇటు క్రికెట్ ను ఎలా మేనేజ్ చేస్తున్నారని మీడియా మనోజ్ తివారీని ప్రశ్నించింది. మనోబలం ఉంటే ఏదైనా సాధ్యమేనని తివారీ బదులిచ్చాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కీలకమని అభిప్రాయపడ్డాడు. 

తాను క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్న సమయంలో, మంత్రిత్వ శాఖ పనులు, నియోజకవర్గానికి చెందిన పనులకు సంబంధించిన పత్రాలన్నీ తాను బస చేసే హోటల్ గదికి చేరుకుంటాయని తెలిపాడు. అందుకోసం తాను ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నానని పేర్కొన్నాడు. 

"ఉదయం క్రికెట్ ఆడతాను... సాయంత్రం మంత్రిత్వ శాఖ ఫైళ్లను పరిశీలిస్తాను. ఇన్చార్జి మంత్రి కూడా ఉండడం వల్ల వెసులుబాటు లభిస్తుంది" అని వివరించాడు. తన బృందంలోని వ్యక్తులు ఎంతో ఉపయుక్తంగా ఉంటారని, వారికి రాత్రివేళల్లోనూ తాను ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటానని మనోజ్ తివారీ వెల్లడించాడు. క్రికెట్ ఆడేటప్పుడు రాజకీయాలు, మంత్రిత్వశాఖ గురించి ఆలోచించనని స్పష్టం చేశాడు. అలాగే మంత్రిత్వ శాఖ పనులు పర్యవేక్షించే సమయంలో క్రికెట్ గురించి ఆలోచించనని పేర్కొన్నాడు.
Manoj Tiwary
Cricket
Sports Minister
West Bengal

More Telugu News