Presidential election: ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా!.. నేడు ఢిల్లీలో విపక్షాల భేటీ

  • ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్న శరద్‌పవార్, ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ
  • వ్యూహాత్మకంగా యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి
  • నేటి విపక్షాల సమావేశంలో పేరు ప్రకటించే అవకాశం
TMC may pitch Yashwant Sinhas name for presidential Election

విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ఇప్పుడు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా (85) పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తాము బరిలోకి దిగలేమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఇప్పటికే తేల్చి చెప్పగా, మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ కూడా నిన్న రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ఇప్పుడు యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి వచ్చింది. శరద్ పవార్ నేతృత్వంలో నేడు ఢిల్లీలో విపక్షాలు భేటీ కానున్నాయి. ఈ సమావేశంలో యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించే అవకాశం ఉంది.

మాజీ ఐఏఎస్ అయిన యశ్వంత్ సిన్హా 1984లో జనతాదళ్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన గతేడాది ఆ పార్టీకి రాజీనామా చేసి టీఎంసీ గూటికి చేరారు. ప్రస్తుతం ఆయన టీఎంసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.  దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయికి అత్యంత సన్నిహితుడైన సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన అభ్యర్థిత్వానికి ఇప్పటికే కొన్ని పార్టీలు మద్దతు పలికాయని, మమతా బెనర్జీ కూడా అందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం. బీజేపీని ఎదుర్కొనేందుకు సిన్హా పేరును వ్యూహాత్మకంగానే తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.

More Telugu News