PPF: మీకు పీపీఎఫ్ గురించి తెలుసా... రిటైరయ్యే నాటికి మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తుంది!

  • ప్రభుత్వ పొదుపు పథకాల్లో మేటి పీపీఎఫ్
  • ఏడాదికి కనిష్ఠంగా రూ.500 చెల్లింపు
  • ఏడాదికి గరిష్ఠ పరిమితి రూ.1.50 లక్షలు
  • 15 ఏళ్ల కాలావధికి స్కీమ్
  • ఆపై ఐదేళ్ల చొప్పున పొడిగించే అవకాశం
PPF Scheme makes crorepati with savings

ఆర్థిక భరోసా అంశం అత్యధిక ప్రాధాన్యం కలిగివున్న ఈ రోజుల్లో పొదుపు అత్యావశ్యకంగా మారింది. ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇదే ఆలంబన. కానీ ఎలాంటి స్కీములను ఎంచుకుని పొదుపు చేయాలన్నది చాలామందికి స్పష్టత ఉండదు. రిటైరయ్యేనాటికి కోటీశ్వరుల్ని చేసే కొన్ని స్కీములు ఉన్నాయన్నది అందరికీ తెలియదు. 

అయితే, అధిక వడ్డీని అందించే కొన్ని మెరుగైన పొదుపు పథకాలు ఎగువ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఒకటి.  దీన్నే సంక్షిప్తంగా పీపీఎఫ్ అంటారు. ఈ సేవింగ్స్ స్కీమ్ ను భారత కేంద్ర ప్రభుత్వమే ప్రవేశపెట్టింది కాబట్టి పొదుపు చేసే డబ్బుపై నిశ్చింతగా ఉండొచ్చు. పైగా పన్నుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. 

ఈ పథకం వివరాల్లోకి వెళితే... ఈ పథకంలో ఏడాదికి కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1,50,000 వరకు పొదుపు చేయవచ్చు. దేశంలో అత్యధిక వడ్డీ అందించే పథకాల్లో పీపీఎఫ్ ఒకటి. ఈ స్కీములో 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ల ద్వారా లభించే వడ్డీల కంటే ఇది చాలా ఎక్కువ. పీపీఎఫ్ లావాదేవీలకు పన్ను మినహాయింపు ఉంటుంది. 

 ఖాతాదారుడు 15 ఏళ్ల పాటు పీపీఎఫ్ లో పొదుపు చేసిన పిదప, తాను దాచుకున్న మొత్తాన్ని కోరుకోకుంటే, ఐదేళ్ల చొప్పున కాల పరిమితిని పెంచుకుంటూ పోవచ్చు. 

పీపీఎఫ్ లో రోజుకు రూ.417 పొదుపు చేస్తే అది నెలకు రూ.12,500 వరకు... సంవత్సరానికి రూ.1.50 లక్షల వరకు చేరుకుంటుంది. స్కీమ్ కాలపరిమితి 15 ఏళ్లు పూర్తయ్యేసరికి ఆ మొత్తం రూ.40.58 లక్షలు అవుతుంది. ఆపై ఐదేళ్ల చొప్పున రెండు పర్యాయాలు స్కీమ్ ను పొడిగిస్తే మొత్తం 25 ఏళ్ల తర్వాత మీరు దాచుకున్న మొత్తం పరిపక్వమై రూ.1.03 కోట్లకు చేరుకుంటుంది. ఈ డబ్బుపై పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. 

పాతికేళ్ల పాటు పీపీఎఫ్ లో పొదుపు చేయడం ద్వారా ఒక్క వడ్డీ రూపంలోనే రూ.66 లక్షలు లభిస్తాయి. ఓ వ్యక్తి పాతికేళ్లలో ఈ పథకం కోసం చెల్లించేది రూ.37 లక్షలే. వడ్డీతో కూడా కలుపుకుంటే... దీని ప్రకారం... 35 ఏళ్ల వయసులో పీపీఎఫ్ సేవింగ్స్ ప్రారంభిస్తే 60 ఏళ్లకు మీరు కోటీశ్వరులు అవుతారు. పోస్టాఫీసుల ద్వారానూ ఈ పీపీఎఫ్ స్కీములో చేరొచ్చు.

More Telugu News