KSCA: వర్షం కారణంగా రద్దయిన చివరి టీ20.. టికెట్ల రుసుములో 50 శాతం వెనక్కి!

  • వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటన
  • ఒక్క బంతి పడినా డబ్బులు వాపస్ ఇవ్వడానికి అంగీకరించని నిబంధనలు
  • ఒరిజనల్ టికెట్లు వెనక్కి ఇచ్చి డబ్బులు పొందాలన్న కేఎస్‌సీఏ
KSCA announces 50 percent refund for ticket holders

భారత్-దక్షిణాఫ్రికా మధ్య బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమైన సిరీస్ నిర్ణయాత్మక చివరి టీ20 వర్షం కారణంగా రద్దైంది. కేవలం 3.3 ఓవర్లపాటు మాత్రమే జరిగిన ఈ మ్యాచ్‌ను వరుణుడు శాంతించకపోవడంతో రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా నిలిచాయి. మ్యాచ్‌ రద్దు కావడంతో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) కీలక ప్రకటన చేసింది. ప్రేక్షకులు కొనుగోలు చేసిన టికెట్ మొత్తంలో సగం వెనక్కి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 
 
నిజానికి నియమ నిబంధనల ప్రకారం ఒక్క బాల్ వేసినా టికెట్ల సొమ్మును వెనక్కి ఇవ్వరు. అయితే, మ్యాచ్ ఆగిపోయి నిరాశలో ఉన్న అభిమానులను మరింత నిరుత్సాహానికి గురిచేయకూడదన్న ఉద్దేశంతో టికెట్ సొమ్ములో 50 శాతం వెనక్కి ఇవ్వాలని నిర్ణయించింది. తమ ఒరిజినల్ టికెట్లను వెనక్కి ఇచ్చి రిఫండ్ పొందాలని మ్యాచ్‌కు హాజరైన వారికి సూచించింది.

More Telugu News