టీడీపీని, ఆ పార్టీ బ్యాంకు బ్యాలెన్స్‌ను కబ్జా చేసిన వ్య‌క్తి చంద్ర‌బాబు: మంత్రి కారుమూరి

  • అయ్య‌న్న ఇంటి ప్ర‌హ‌రీని కూల్చేసిన అధికారులు
  • ఈ ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించిన టీడీపీ నేత‌లు
  • బీసీ నేతలపై క‌క్ష సాధిస్తున్నారన్న చంద్ర‌బాబు
  • చంద్ర‌బాబు ఏ పార్టీ నుంచి వ‌చ్చార‌న్న కారుమూరి
  • చంద్ర‌బాబు బాటలోనే అయ్య‌న్న న‌డుస్తున్నార‌ని ఆరోప‌ణ‌
apminister karumuri nageswara rao counter to chandrababu

టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు ఇంటి ప్ర‌హ‌రీని కూల్చివేసిన ఘ‌ట‌న‌పై ఆ పార్టీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను తిప్పికొట్టే క్ర‌మంలో వైసీపీ నేత‌, ఏపీ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీసీ అయినంత మాత్రాన అయ్య‌న్న‌పాత్రుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా? అని ప్ర‌శ్నించారు. అయ్య‌న్న‌పాత్రుడు వ్వ‌వ‌హారంలో చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

ఈ సంద‌ర్భంగా, అయ్య‌న్న‌పాత్రుడు బీసీ అయినందున‌నే ఆయ‌న‌పై వైసీపీ ప్ర‌భుత్వం క‌క్ష‌సాధిస్తోందంటూ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి కారుమూరి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు అస‌లు ఏ పార్టీ నుంచి వ‌చ్చార‌ని ప్ర‌శ్నించిన కారుమూరి... టీడీపీతో పాటు ఆ పార్టీ బ్యాంకు బ్యాలెన్స్‌ను కూడా క‌బ్జా చేసిన వ్య‌క్తి చంద్ర‌బాబు అని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు బాట‌లోనే అయ్య‌న్నపాత్రుడు న‌డుస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. మీరు త‌ప్పు చేసి దానిని బీసీల‌పై రుద్ద‌డం ఏమిట‌ని కారుమూరి ప్ర‌శ్నించారు.

More Telugu News