Assam flood: అసోం వరదల్లో 63కి చేరిన మరణాలు.. నిన్న ఒక్కరోజే 8 మంది మృతి

  • రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలు
  • 32 జిల్లాల్లో 31 లక్షల మందిపై ప్రభావం
  • కొండ చరియలు విరిగిపడటంతో ఎక్కువ ప్రాణ నష్టం
Assam flood  Death toll reaches 63

అసోం రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతోంది. తీవ్ర వరదల కారణంగా ఇప్పటిదాకా 63 మంది మరణించారు. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో ఎనిమిది మంది చనిపోయారు. వరదలతో పాటు కొండ చరియలు విరిగిపడటంతో ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతోంది. రాష్ట్రంలోని  32 జిల్లాల్లో  దాదాపు 31 లక్షల మంది ప్రజలపై వరదల ప్రభావం పడింది. హోజాయ్ జిల్లాలో శుక్రవారం రాత్రి పడవ బోల్తా పడటంతో ముగ్గురు చిన్నారులు సహా ఎనిమిది మంది గల్లంతయ్యారు. వాళ్లను హోజాయ్, బజాలీ, వెస్ట్ కర్బీ అంగ్లాంగ్, కోక్రాజార్, తముల్పూర్ జిల్లా వాసులుగా గుర్తించారు. ఆ ప్రాంతంలో నీటిలో చిక్కుకున్న 21 మందిని రక్షించారు.

 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు.  కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కమ్రూప్, దర్రాంగ్ జిల్లాల్లోని బాధిత ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న కొన్ని సహాయ శిబిరాలను  సీఎం హిమంత సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంతటి ఆపదనైనా ఎదుర్కొనేందుకు, వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. సహాయక శిబిరాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం హామీ ఇచ్చారు. 

 మరోవైపు వరదలపై  కేంద్ర జల కమిషన్ (సీడబ్ల్యూసీ) శనివారం బులిటెన్ విడుదల చేసింది. నాగావ్ జిల్లాలో కోపిలి నది అధిక వరద స్థాయి కంటే ఎక్కువగా ప్రవహిస్తోందని చెప్పింది. బ్రహ్మపుత్ర, జియా-భరాలి, పుతిమరి, పగ్లాడియా, మానస్, బెకి, బరాక్ మరియు కుషియారా వంటి ఇతర నదులు ప్రవహిస్తాయని అధికారులను అప్రమత్తం చేసింది. 

 అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం వదరల వల్ల 32 జిల్లాల్లో 30.99 లక్షల జనాభా ప్రభావితమైంది. అదే సమయంలో 66 వేల పైచిలుకు హెక్టార్లలో పంట ముంపునకు గురైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 514 సహాయ శిబిరాల్లో  నిరాశ్రయులైన 1.56 లక్షల మంది ప్రజలు తలదాచుకుంటున్నారు. 

More Telugu News