ఇవాళ 'కొండా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రేవంత్ రెడ్డి రావాల్సి ఉంది... ఆయనను ఇంకా ఎందుకు వదిలిపెట్టలేదు?: రామ్ గోపాల్ వర్మ

18-06-2022 Sat 17:30 | Telangana
  • నిన్న సికింద్రాబాద్ లో పోలీసుల కాల్పులు
  • రాకేశ్ అనే యువకుడి మృతి
  • నేడు అంత్యక్రియలకు బయలుదేరిన రేవంత్ 
  • మార్గమధ్యంలో రేవంత్ ని అరెస్ట్ చేసిన పోలీసులు
Ram Gopal Varma reacts to Revanth Reddy arrest
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసకాండలో పోలీసుల కాల్పుల్లో దామోదర రాకేశ్ అనే యువకుడు మృతి చెందడం తెలిసిందే. అతని అంత్యక్రియలు ఇవాళ స్వగ్రామంలో జరిగాయి. రాకేశ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు ఘట్ కేసర్ వద్ద అరెస్ట్ చేశారు. దీనిపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. 

ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు 'కొండా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని, ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని తెలిపారు. కాల్పుల్లో చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే గొడవలు జరగొచ్చన్నది కారణమైతే, అంత్యక్రియలు 3.45 గంటలకే అయిపోయినప్పుడు, రేవంత్ రెడ్డిని ఇంకా ఎందుకు వదిలిపెట్టలేదని వర్మ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.