Revanth Reddy: ఇది రాకేశ్ అంతిమయాత్రనా?… టీఆర్ఎస్ విజయోత్సవ ర్యాలీనా?: రేవంత్ రెడ్డి

  • నిన్న సికింద్రాబాద్ లో హింసాత్మక ఘటనలు
  • పోలీసు కాల్పుల్లో దామోదర రాకేశ్ మృతి
  • టీఆర్ఎస్ నేతలు మనుషులేనా? అంటూ రేవంత్ ఆగ్రహం
  • శవరాజకీయాలు అంటూ తీవ్ర విమర్శలు
Revanth Reddy slams TRS party over Rakesh final journey

నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన దామోదర రాకేశ్ అంతిమయాత్రలో టీఆర్ఎస్ జెండాలు కనిపించడంపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు మనుషులేనా? ఆర్మీ ఆశావహుడి మరణాన్ని మీ రాజకీయం కోసం ఇంతలా దిగజార్చుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీజేపీ ప్రభుత్వం కాల్చి చంపితే, టీఆర్ఎస్ ప్రభుత్వం శవరాజకీయంతో మరోసారి చంపిందని విమర్శించారు. 'ఇది రాకేశ్ అంతిమయాత్రనా? లేక టీఆర్ఎస్ విజయోత్సవ ర్యాలీనా? సమాజమే ఆలోచించాలి' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

అటు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై నిప్పులు చెరిగింది. ఆ వీరుడి అంతిమయాత్రలో ఉండాల్సింది భారత త్రివర్ణపతాకం... మీ ఫాసిస్టు జెండాలు కాదు అంటూ టీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాబందులు శవాల మీద వాలి పీక్కుతినడం టీఆర్ఎస్ నాయకులను చూసే నేర్చుకున్నాయేమో అనిపిస్తుందని విమర్శించింది. 

అంతేకాదు, రాకేశ్ అంతిమయాత్రలో తమ బలం చూపించుకునేందుకు డబ్బులిచ్చి ప్రజలను తెచ్చుకున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపించింది. ఒక వీరుడి అంతిమయాత్రలో ఈ విధంగా శవరాజకీయాలకు పాల్పడడం సిగ్గుచేటు అని పేర్కొంది.

More Telugu News