Teacher: క్లాస్ రూమ్ లో విద్యార్థినులతో చిందులేసిన టీచర్

  • ఢిల్లీ ప్రభుత్వ టీచర్ సరదా చర్య
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్
  • తరగతి గదిలో జుమ్కా బరేలి వాలా పాటకు చక్కని నృత్యం
Teacher and students dance to Jhumka Bareli Wala in an empty classroom

పాప్యులర్ సాంగ్ ‘జుమ్కా బరేలి వాలా’ తెలిసే ఉంటుంది. ఓ ప్రైవేటు ఆల్బమ్ లోని ఈ పాటకు ఓ టీచర్, తన విద్యార్థినులతో కలసి తరగతి గదిలోనే అందంగా స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. విద్యార్థులు కొద్దిగా తడబడినా.. టీచర్ మాత్రం స్టెప్పుల్లో లయ తప్పలేదు. దీన్ని ఇప్పటికే 5.69 లక్షల మంది చూసేశారు. 


కొంత సాధన చేసినట్టు వీడియో చూస్తే తెలుస్తుంది. ఒకరి తర్వాత ఒకరు క్రమబద్ధంగా, లయబద్దంగా స్టెప్పులు వేశారు. టీచర్ కూడా వారిలో ఒకరిగా మారిపోయారు. దీన్ని వీడియో తీయించారు. టీచర్ మను గులాటి స్వయంగా తన ట్విట్టర్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. ‘‘వేసవి శిబిరం చివరి రోజున మా అసంపూర్ణ నృత్యం. ఆనందం, కలయిక తోడైతే కొన్ని కచ్చితమైన స్టెప్పులకు దారితీస్తుంది’’ అంటూ టీచర్ తన పేజీలో రాశారు.  

ఢిల్లీ ప్రభుత్వ టీచర్ అయిన మను గులాటీ స్నేహంగా మెలగడం ద్వారా విద్యార్థుల మనసులను చూరగొనడమే కాదు.. ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో అవార్డులను గెలుచుకున్న వ్యక్తి. ఇందులో 2018లో కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి అందుకున్న నేషనల్ టీచర్స్ అవార్డు కూడా ఉంది.

More Telugu News