Hyderabad: 2014 తర్వాత హైదరాబాద్‌ లో తొలిసారి పేలిన పోలీసు తూటా!

secunderabad police firing is the first time since 8 years
  • 8 సంవత్సరాల తర్వాత మళ్లీ కాల్పులు
  • 2014లో రాజేంద్రనగర్ వద్ద మతకలహాల సందర్భంగా కాల్పులు
  • ఆ ఘటనలో ముగ్గురి మృతి
  • ఉమ్మడి ఏపీలో 2000వ సంవత్సరంలో బషీర్‌‌‌బాగ్‌లో కాల్పులు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో నిన్న జరిగిన ఆందోళన తీవ్రరూపం దాల్చి హింసాత్మక రూపు సంతరించుకుంది. పలు రైళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. 

ఇక హైదరాబాద్‌లో పోలీసులు తమ తుపాకులకు పనిచెప్పడం ఎనిమిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 14 మే 2014లో రాజేంద్రనగర్‌లోని సిక్‌చావని వద్ద జరిగిన మతకలహాలు పోలీసుల కాల్పులకు దారితీశాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఆ తర్వాత మళ్లీ ఇదే తొలిసారి.

అంతకుముందు 28 మే 2010లో ఓదార్పుయాత్రకు వెళ్లిన వైసీపీ చీఫ్, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్‌ స్టేషన్‌లో అడ్డుకుని రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రఫుల్ రాజు అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 28 జులై 2007లో ఖమ్మం జిల్లా ముదిగొండలో పేదలకు భూమి పంచాలంటూ చేపట్టిన ఆందోళన కూడా కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఏకంగా 8 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

18 మే 2007లో హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుడు అనంతరం ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 18 ఆగస్టు 2000లో ఉమ్మడి ఏపీలో ప్రతిపక్షాలు చేపట్టిన విద్యుత్ ఉద్యమంలోనూ పోలీసులు తుపాకులకు పని చెప్పారు. బషీర్‌బాగ్ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో బాలస్వామి, రామకృష్ణ అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
Hyderabad
Secunderabad
Police Firing
Agnipath Scheme

More Telugu News