Visakhapatnam: అగ్నిపథ్ ఎఫెక్ట్.. విశాఖపట్టణం రైల్వే స్టేషన్ మూత

  • స్టేషన్‌లోకి ఎవరూ రాకుండా చర్యలు
  • అర కిలోమీటరు ముందే బారికేడ్లు
  • విజయవాడ మీదుగా వచ్చే రైళ్లను దువ్వాడ వద్ద..
  • హౌరా నుంచి వచ్చే రైళ్లను కొత్తవలస వద్ద నిలిపివేత
  • రైళ్లన్నీ దారిమళ్లింపు
visakhapatnam railway station closed due to agnipath agitations

‘అగ్నిపథ్’ ఆందోళనల నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే అధికారులు విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌ను మూసివేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిన్న జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్టా రైల్వే స్టేషన్‌ను మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు స్టేషన్ మూతలో ఉంటుందని, అప్పటి వరకు ఎవరినీ లోపలికి అనుమతించబోమని ప్రకటించారు. 

కాగా, ఇప్పటికే బయలుదేరి విజయవాడ మీదుగా విశాఖపట్టణం చేరుకోవాల్సిన రైళ్లను దువ్వాడ వద్ద, హౌరా నుంచి వచ్చే రైళ్లను కొత్తవలస వద్ద నిలిపివేసి దారి మళ్లిస్తామని అధికారులు తెలిపారు.

రైళ్లు విశాఖ రాకుండా చర్యలు తీసుకున్న అధికారులు.. స్టేషన్‌కు అర కిలోమీటరు ముందు బారికేడ్లు ఏర్పాటు చేసి స్టేషన్‌లోకి ఎవరూ చొరబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఉదయం ఏడు గంటల వరకు ఉన్న ప్రయాణికులను మాత్రం తనిఖీల అనంతరం స్టేషన్‌లోకి అనుమతించారు. స్టేషన్ వద్ద భారీగా బలగాలను మోహరించారు.

More Telugu News