Floods: ఈశాన్య రాష్ట్రాల్లో వరద విలయం... 16 మంది మృతి

  • ఈశాన్య రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావం
  • మేఘాలయ, అసోం రాష్ట్రాల్లో 272 మిమీ వర్షపాతం
  • ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ప్రధాన నదులు
  • 1700 గ్రామాలు నీటమునక
  • 11 లక్షల మందిపై వరద ప్రభావం
  • ఈ వారాంతం వరకు వర్ష సూచన
Flood disaster in Meghalaya and Assam

నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్నిరోజులుగా అసోం, మేఘాలయ రాష్ట్రాలు వరద గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నదులన్నీ ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. బ్రహ్మపుత్ర, గౌరంగ నదీ పరీవాహక ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 

దాదాపు 1700 గ్రామాలు వరదముంపుకు గురయ్యాయి. ఇప్పటివరకు 16 మంది మరణించారు. ఒక్క మేఘాలయలోనే 13 మంది కన్నుమూశారు. 25 జిల్లాల్లోని 11 లక్షల మంది ప్రజలపై వరద ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. అసోంలో కొత్తగా ఏర్పాటు చేసిన బాజాలీ జిల్లా వరదల కారణంగా అతలాకుతలమైంది. 

అటు, నల్బరి, గోగ్రాపూర్ లో ట్రాక్ పై నీళ్లు నిలిచిపోయిన కారణంగా ఆరు రైళ్లను రద్దు చేశారు, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మేఘాలయ, అసోం రాష్ట్రాల్లో బుధవారం వరకు 272 మిమీ వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వారాంతం వరకు కుంభవృష్టి తప్పదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనేట్టు కనిపించడంలేదు.

More Telugu News