Agnipath: బీహార్ లో మరింత ప్రజ్వరిల్లిన 'అగ్నిపథ్' వ్యతిరేక నిరసన జ్వాలలు... బీజేపీ కార్యాలయం ధ్వంసం

More violence raises in Bihar opposing Agnipath
  • సాయుధ దళాల్లో నాలుగేళ్ల స్వల్పకాలిక సేవలు
  • అగ్నిపథ్ పేరిట నూతన నియామక విధానం
  • మండిపడుతున్న ఆర్మీ ఆశావహులు
  • బీహార్, హర్యానా, యూపీల్లో హింసాత్మక ఘటనలు
 సాయుధ దళాల్లో నాలుగేళ్ల స్వల్పకాలానికి సేవలు అందించేందుకు 'అగ్నిపథ్' పేరిట కేంద్ర ప్రభుత్వం నియామక విధానం ప్రకటించిన సంగతి తెలిసిందే. పదో తరగతి, ఇంటర్ పాసయిన వారు ఆసక్తి ఉంటే ప్రతిభాపాటవాల ఆధారంగా సైన్యంలో చేరొచ్చు. వీరు నాలుగేళ్ల పాటు సేవలు అందించిన తర్వాత వీరు సైన్యంలో రెగ్యులర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్నిపథ్ విధానంలో నాలుగేళ్లు సైన్యంలో పనిచేసివారికి రెగ్యులర్ నియామకాల్లో 25 శాతం కోటా ఉంటుంది. అయితే, సైన్యంలో చేరాలన్న లక్ష్యంతో ఉన్నవారిని కేంద్రం నిర్ణయం తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. 

కేంద్రం నిర్ణయంపై బీహార్ లో తీవ్రస్థాయిలో నిరసన జ్వాలలు చెలరేగాయి. రైళ్లను, ఇతర రవాణా వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. తాజాగా, నవాడాలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఆపై నిప్పంటించారు. బీజేపీ ఎమ్మెల్యే అరుణాదేవి కోర్టుకు వెళుతుండగా ఆమె వాహనంపైనా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో అరుణాదేవికి గాయాలయ్యాయి. 

ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ, పలు రైల్వే స్టేషన్లను కూడా ధ్వంసం చేసిన నేపథ్యంలో, బీహార్ నుంచి 22 రైళ్లను రద్దు చేశారు. ఐదు రైళ్లను నిలిపివేశారు. 

అటు, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో కూడా అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు. హర్యానాలోని పల్వాల్ జిల్లాలో ఆర్మీ ఆశావహులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో, జిల్లా వ్యాప్తంగా ఫోన్ ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్ సేవలను నిలిపివేశారు. ఆందోళనకారులు ఏకంగా పోలీసు వాహనాలకే నిప్పుపెట్టడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.
Agnipath
Protests
Bihar
Violence
Haryana
Uttar Pradesh

More Telugu News