ATM: రూ.500కు రూ.2,500.. ఏటీఎం ముందు భారీ క్యూ

  • మహారాష్ట్రలోని నాగ్ పూర్ సమీపంలో చిత్రమైన ఘటన
  • రూ.500 సెలక్ట్ చేసుకుంటే ఏటీఎం నుంచి రూ.2,500
  • మానవ తప్పిదంగా గుర్తింపు
  • రూ.100 నోట్ల ట్రేలో రూ.500 నోట్లు పెట్టిన సిబ్బంది
ATM dispenses 5 times extra cash in Nagpur

ఏటీఎం అడిగినదానికంటే ఎక్కువ డబ్బులిస్తుంటే ఏం జరుగుతుంది..? ఇంకేముంది ఆ టెల్లర్ మెషిన్ లో కరెన్సీ అయిపోయే వరకూ అక్కడ జనసందోహంతో కోలాహలంగా ఉంటుంది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ సమీపంలో ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. 


నాగ్ పూర్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖపర్ కేడ పట్టణంలో ఒక వ్యక్తి బుధవారం ఏటీఎం సెంటర్ కు వెళ్లాడు. తనకు రూ.500 అవసరం ఉండడంతో అంతే మొత్తాన్ని సెలక్ట్ చేసుకున్నాడు. తీరా మెషిన్ నుంచి డబ్బు బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే రూ.2,500 ఉన్నాయి. రూ.500 నోటు ఒకదానికి బదులు ఐదు వచ్చాయి. 

ఎందుకు అలా జరిగిందో అతడికి అస్సలు అర్థం కాలేదు. తాను పొరపాటుగా సెలక్ట్ చేసుకున్నానా?, మరోసారి చెక్ చేద్దామని చెప్పి ఈ సారి కూడా రూ.500 సెలక్ట్ చేశాడు. చిత్రంగా మరోసారి రూ.2,500 అంటే రూ.500 నోట్లు ఐదు వచ్చాయి. ఈ విషయం ఒకరి నుంచి మరొకరికి ఆ పట్టణంలో వ్యాపించింది. భారీ క్యూతో ఏటీఎం ముందు అంతమంది గుమికూడడాన్ని చూసి ఎవరో ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో పోలీసులు ఏటీఎం కేంద్రాన్ని మూసివేసి, బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంతకీ అలా ఎందుకు జరిగిందంటే..? ఇందులో మానవ తప్పిదం కనిపిస్తోంది. మెషిన్ లో రూ.100 నోట్లను ఉంచే ట్రేలో రూ.500 నోట్లు పెట్టారు. దీంతో రూ.500 సెలక్ట్ చేసుకున్న వారికి రూ.100 నోట్లని భావించి 5 ఇస్తోంది.

More Telugu News