SpiceJet: విమాన ప్రయాణికులపైనా ధరాభారం.. త్వరలో చార్జీల పెంపు!

  • ఏటీఎఫ్ ధరలను 16 శాతం పెంచిన ఆయిల్ కంపెనీలు
  • 2021 నుంచి 120 శాతానికి పైగా పెంపు
  • ఎయిర్ లైన్స్ సంస్థల వ్యయాలపై మరింత భారం
  • టికెట్ ధరలు 10-15 శాతం వరకు పెంచొచ్చన్న స్పైస్ జెట్
SpiceJet demands 15percent hike in airfare as jet fuel prices touch all time high

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడం, గత కొన్ని నెలలుగా 110 డాలర్లకు పైనే ఉండడం విమానయాన సంస్థలను (ఎయిర్ లైన్స్) తీవ్ర నష్టాల పాలు చేస్తోంది. దీంతో అతి త్వరలోనే రేట్ల పెంపు తప్పదని చౌక విమానయాన సేవల సంస్థ స్పైస్ జెట్ సంకేతం ఇచ్చింది. ఒకవైపు చమురు ధరలు పెరగడం, మరోవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ క్షీణించడాన్ని ఈ సంస్థ ప్రస్తావించింది. 


డాలర్ తో రూపాయి విలువ క్షీణించడం వల్ల దిగుమతుల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. మన దేశ చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. కనుక ఈ ప్రభావం వినియోగదారులపై మరింత పడనుంది. రూపాయి విలువ క్షీణత తమపై ఎక్కువగా ఉందని స్పైస్ సెట్ చైర్మన్ అజయ్ సింగ్ పేర్కొన్నారు. తమ వ్యయాల్లో అధిక శాతం డాలర్ డీనామినేటెడ్ లోనే ఉన్నట్టు చెప్పారు. 

త్వరలోనే విమాన టికెట్ల ధరలను పెంచక తప్పని పరిస్థితి ఉన్నట్టు అజయ్ సింగ్ చెప్పారు. కనీసం 10-15 శాతం వరకు పెరగొచ్చని పేర్కొన్నారు. 2021 జూన్ నుంచి ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర 120 శాతానికి పైనే పెరిగినట్టు తెలిపారు. 

మరోవైపు ఏటీఎఫ్ ధరను 16.3 శాతం పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గురువారం ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో కిలో లీటర్ జెట్ ఏటీఎఫ్ ధర రూ.1.41 లక్షలకు చేరింది. దీంతో ఇప్పటికే వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయని చెబుతున్న ఎయిర్ లైన్ సంస్థలపై మరింత భారం పడనుంది. దీంతో విమాన ప్రయాణికులు తమ జేబు నుంచి అధికమొత్తాన్ని ఖర్చు చేయక తప్పేలా లేదు.

More Telugu News