Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఒప్పందంపై సంతకాలు చేయం.. థియేటర్లు మూసేందుకు కూడా సిద్ధమే: సినిమా ఎగ్జిబిటర్లు

AP cinema theater owners not willing to sign MOU with government
  • జులై 2 లోగా ఎంవోయూలపై సంతకాలు చేయాలని ప్రభుత్వ ఆదేశం
  • టికెట్ డబ్బులు థియేటర్లకు ఎప్పుడు చెల్లిస్తారనే విషయంలో లేని క్లారిటీ
  • ఎంవోయూపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న థియేటర్ల యాజమాన్యాలు
ఏపీలో సినిమా టికెట్లను ఆన్ లైన్ లో అమ్మే అంశానికి సంబంధించిన వివాదం మళ్లీ మొదటకొచ్చింది. ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా టికెట్లను అమ్మాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ నెల 2న జీవో 69ని విడుదల చేసింది. టికెట్ల అమ్మకాలకు సంబంధించి నెల రోజుల్లో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆదేశించింది. 

అయితే ఎంఓయూ పత్రాలను చూసిన థియేటర్ యజమానులు షాక్ కు గురవుతున్నారు. టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించడం వరకు బాగానే ఉన్నప్పటికీ... టికెట్ల విక్రయాల తర్వాత థియేటర్లకు డబ్బు ఎప్పుడు జమ చేస్తారనే విషయాన్ని ఎంఓయూలో పేర్కొనకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఎంవోయూపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

ఫిలిం ఛాంబర్ ద్వారానే ఆన్ లైన్ లో టికెట్ల విక్రయాలను జరుపుతామని ఎగ్జిబిటర్లు కోరారు. మరోవైపు ఎంవోయూపై సంతకం పెడితే ప్రభుత్వం చేతుల్లో చిక్కుకున్నట్టేనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే... జులై 2లోగా ఎంవోయూలపై సంతకాలు చేయకపోతే థియేటర్ల లైసెన్స్ రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. 

అయినప్పటికీ సంతకాలు చేయబోమని, థియేటర్లు మూసివేసేందుకు కూడా సిద్ధమేనని థియేటర్ యజమానులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల ఆందోళనను, అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది.
Andhra Pradesh
Government
Cinema
Tickets
Online
MOU
Theaters

More Telugu News