Sri Lanka: పెను ప్రమాదాన్ని తప్పించి 525 మంది ప్రయాణికులను కాపాడిన శ్రీలంక పైలట్లు.. ప్రశంసల వర్షం

A Sri Lanka pilot refused order to climb to 35000 feet
  • ఈ నెల 13న పెను ప్రమాదాన్ని తప్పించిన శ్రీలంక పైలట్లు
  • 35 వేల అడుగుల ఎత్తులోకి వెళ్లమన్న అంకారా ఏటీసీ
  • అదే ఎత్తులో మరో విమానం వస్తోందని గుర్తించిన పైలట్లు
  • పైకి వెళ్లేందుకు నిరాకరించిన పైలట్లు
  • ఆ తర్వాత తప్పును గుర్తించిన ఏటీసీ
గగనతలంలో విమానాలు ఢీకొట్టుకునే పెను ప్రమాదాన్ని తప్పించి 525 మంది ప్రాణాలను కాపాడిన శ్రీలంక పైలట్లపై సర్వత్ర ప్రశంలస వర్షం కురుస్తోంది. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూఎల్-504 విమానం ఈ నెల 13న లండన్ నుంచి 275 మంది ప్రయాణికులతో కొలంబో బయలుదేరింది. విమానం టర్కీ గగనతలం పైనుంచి 33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో విమానాన్ని 35 వేల అడుగులకు తీసుకెళ్లాలని అంకారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుంచి పైలట్లకు ఆదేశాలు అందాయి. 

అయితే, అదే ఎత్తులో మరో విమానం వస్తోందని, కేవలం 15 మైళ్ల దూరంలోనే ఉందని శ్రీలంక పైలట్లు గుర్తించారు. వెంటనే వారు ఆ విషయాన్ని ఏటీసీ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ పట్టించుకోని ఏటీసీ పైకి వెళ్లేందుకు రెండుసార్లు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే, ప్రమాదాన్ని ఊహించిన శ్రీలంక పైలట్లు 35 వేల అడుగుల ఎత్తుకు వెళ్లేందుకు నిరాకరించారు. 

ఆ తర్వాత తమ పొరపాటును గుర్తించిన ఏటీసీ పైకి వెళ్లవద్దని, అదే ఎత్తులో దుబాయ్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం 250 మందితో వస్తోందని శ్రీలంక పైలట్లకు సమాచారం ఇచ్చింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఏటీసీ తొలుత ఇచ్చిన ఆదేశాలను పైలట్లు గుడ్డిగా పాటించి ఉంటే 525 మంది ప్రాణాలు గాలిలో కలిసి పోయి ఉండేవంటూ శ్రీలంక ఎయిర్‌లైన్స్ నిన్న వెల్లడించింది. పైలట్లు సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందంటూ ప్రశంసించింది.
Sri Lanka
Sri Lankan Airlines
London
Colombo
British Airways

More Telugu News