Shobha Karandlaje: అప్పులు, అవినీతిలో ఏపీ పరాకాష్ఠకు చేరుకుంది.. రాబడిని విదేశాలకు తరలిస్తున్నారా?: కేంద్రమంత్రి శోభా కరంద్లాజే

Union Minister Shobha Karandlaje Slams AP government
  • అనంతపురంలో బీజేపీ బహిరంగ సభ
  • ఈ మూడేళ్లలో ఒక్క కాలేజీ అయినా కట్టారా? అని ప్రశ్నించిన మంత్రి
  • బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధన్న శోభ  
  • పోలీసులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరుకుందని ఆవేదన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో నిన్న జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పులు, అవినీతిలో పరాకాష్ఠకు చేరుకుందన్నారు. ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో రూపాయి కూడా లేదని, మరి వస్తున్న రాబడి ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే ఖజానాకు వస్తున్న నిధులను విదేశాలకు తరలిస్తున్నట్టు అనుమానం కలుగుతోందన్నారు. 

పోలీసులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి ప్రభుత్వం చేరుకుందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క కళాశాల అయినా కట్టారా? ఒక్క రోడ్డయినా వేశారా? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రంలోని తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆరు ఎయిమ్స్‌లు ఏర్పాటు చేస్తే అందులో ఒకటి మంగళగిరిలో ఉందని, దానిని వచ్చే నెల 4న ప్రధాని మోదీ ప్రారంభిస్తారని శోభ తెలిపారు.
Shobha Karandlaje
BJP
Anantapuram
Andhra Pradesh

More Telugu News