Uttar Pradesh: జాతీయ రహదారిపై కార్లలో పెళ్లి ఊరేగింపుతో విన్యాసాలు.. రూ. 2 లక్షల జరిమానా విధించిన పోలీసులు.. వీడియో ఇదిగో!

Groom dances takes selfies in moving open roof Audi in UP
  • ముజఫర్‌నగర్-హరిద్వార్‌ జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ఊరేగింపు
  • కారు డోర్లపై కూర్చుని విన్యాసాలు.. డ్యాన్సులు.. సెల్ఫీలు 
  • 8 కార్లు సీజ్.. రూ. 2 లక్షల జరిమానా
జీవితంలో జరిగే అతిపెద్ద సంబరం పెళ్లి. అందుకనే ఆ మధురానుభూతి జీవితాంతం గుర్తుండాలని ఘనంగా చేసుకోవాలనుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు కూడా అలాగే అనుకున్నాడు. అందుకనే వరుడు, అతడి మిత్రబృందం ఎనిమిది కార్లతో జాతీయ రహదారిపైకెక్కి విన్యాసాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. వరుడు టాప్‌లెస్ ఆడికారులోకి ఎక్కి నిల్చోగా, మిగతా వారిలో కొందరు కార్లపైకెక్కి సెల్ఫీలు తీసుకుంటే, మరికొందరు కారు డోర్లపై కూర్చుని విన్యాసాలు చేశారు. సెల్ఫీలు తీసుకుంటూ డ్యాన్సులు చేశారు మరికొందరు. 

ముజఫర్‌నగర్-హరిద్వార్‌ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదకర ఊరేగింపును ఆ దారినపోయే వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. రోడ్డుపై ప్రమాదకరంగా ఈ ఊరేగింపు ఏంటంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. తోటి ప్రయాణికులను ప్రమాదంలోకి నెట్టేలా ఊరేగింపు జరగడంపై మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినోదం కోసం ఇలా ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి తోయడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ వీడియో తిరిగి తిరిగి పోలీసుల దృష్టిలో పడడంతో చర్యలు ప్రారంభించారు. వరుడి కారు సహా ఊరేగింపులో పాల్గొన్న 8 కార్లను సీజ్ చేశారు. కార్ల యజమానులకు ఏకంగా రూ. 2 లక్షల జరిమానా విధించారు. ఈ విషయాన్ని ముజఫర్‌నగర్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
Uttar Pradesh
Groom
Muzaffarnagar
Haridwar

More Telugu News