Mamata Banerjee: 8 మంది సీఎంల‌ను పిలిస్తే... దీదీ భేటీకి ఒక్క‌రూ రాలేదు!

  • ఢిల్లీ కాన్‌స్టిట్యూష‌న్ క్ల‌బ్‌లో స‌మావేశం
  • రెండు గంట‌ల పాటు జ‌ర‌గ‌నున్న భేటీ
  • శ‌ర‌ద్ ప‌వార్ అభ్య‌ర్థిత్వంపైనే దీదీ గురి
  • ప‌వార్ కాదంటే... గోపాలకృష్ణ గాంధీని బ‌రిలో దింపే అవ‌కాశం
mamata banerjee meeting with oppposition parties started in delhi

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్షాల త‌ర‌ఫున ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిలిపే దిశ‌గా తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ త‌ల‌పెట్టిన కీల‌క భేటీ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూష‌న్ క్ల‌బ్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో ప్రారంభ‌మైంది. ఈ భేటీకి రావాలంటూ దీదీ ఏకంగా 22 మంది జాతీయ స్థాయి నేత‌ల‌కు ఆహ్వానం పంపారు. అయితే కాసేప‌టి క్రితం మొద‌లైన ఈ భేటీకి చాలా త‌క్కువ మందే హాజ‌ర‌య్యారు.

కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఈ భేటీకి మ‌ల్లికార్జున ఖ‌ర్గే, జైరాం ర‌మేశ్‌, ర‌ణ‌దీప్ సింగ్ సూర్జేవాలా హాజ‌ర‌య్యారు. వీరితో పాటు నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ త‌న పార్టీకి చెందిన మ‌రో ఎంపీతో క‌లిసి వ‌చ్చారు. స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ కూడా ఈ భేటీకి హాజ‌ర‌య్యారు. మ‌హారాష్ట్రలో అధికార పార్టీ శివ‌సేన నుంచి ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా చ‌తుర్వేది హాజ‌ర‌య్యారు. 

ఇక జేడీఎస్ నుంచి మాజీ ప్ర‌ధాని హెచ్‌డీ దేవెగౌడ‌, క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి, పీడీపీ నుంచి మెహ‌బూబా ముఫ్తీ, డీఎంకే నుంచి టీఆర్ బాలు, సీపీఐ నుంచి డి.రాజా త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ భేటీకి 8 రాష్ట్రాల సీఎంల‌ను దీదీ ఆహ్వ‌నిస్తే ఒక్క ముఖ్య‌మంత్రి కూడా హాజ‌రుకాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

దాదాపు రెండు గంట‌ల పాటు ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. భేటీకి హాజ‌రైన నేత‌లంద‌రినీ క్ల‌బ్ బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌రీ దీదీ ఆహ్వానించారు. భేటీలో భాగంగా శ‌ర‌ద్ ప‌వార్‌నే విప‌క్షాల అభ్య‌ర్థిగా ప్ర‌తిపాదించాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే అందుకు ప‌వార్ సిద్ధంగా లేక‌పోతే మాత్రం... క్రితం సారి జ‌రిగిన ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో వెంక‌య్య‌నాయుడిపై పోటీ చేసిన గోపాల‌కృష్ణ గాంధీని బ‌రిలోకి దించాల‌ని దీదీ భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

More Telugu News