Madhya Pradesh: రెండేళ్ల చిన్నారిని దారుణంగా హింసించిన ఆయా.. సీసీటీవీలో ఒళ్లు జలదరించే దృశ్యాలు

 CCTV footage reveals chilling visuals of nanny thrashing toddler in MP
  • మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఘటన
  • తల్లిదండ్రులు ఇల్లు వదలగానే వికృతంగా మారిపోతున్న ఆయా 
  • జుట్టు పట్టుకుని ఈడ్చేసి, పొట్టలో పిడిగుద్దులు కురిపించిన వైనం
  • అరెస్ట్ చేసిన పోలీసులు
భార్యాభర్తలిద్దరూ డ్యూటీలు చేసేవారే. దీంతో వారి రెండేళ్ల చిన్నారిని చూసుకునేందుకు రోజూ భోజనం పెట్టి, నెలకు రూ. 5 వేల వేతనంతో ఓ ఆయాను మాట్లాడుకున్నారు. తమ చిన్నారిని ఆమె వద్ద వదిలి నిశ్చింతగా డ్యూటీలకు వెళ్లి వచ్చేవారు. అయితే, చిన్నారిలో క్రమంగా మార్పు రావడంతో పాటు రోజురోజుకు మరింత నీరసంగా తయారవుతుండడంతో అనుమానించిన దంపతులు కుమారుడిని వైద్యుడికి చూపించారు. పరీక్షించిన వైద్యుడు బాలుడి అంతర్గత అవయవాలు వాచిపోవడాన్ని గుర్తించి విషయం చెప్పడంతో వారు హతాశులయ్యారు. చిత్రహింసలు పెట్టడమే అందుకు కారణమై ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశాడు.

దీంతో ఇంట్లో ఏదో జరుగుతోందని అనుమానించిన బాలుడి తల్లిదండ్రులు వైద్యుడి సలహా మేరకు ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అమర్చారు. ఒక రోజు ఆ సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను చూసి వారు విస్తుపోయారు. అప్పటి వరకు అణకువగా ఉంటున్న ఆయా రజినీ చౌదరి వారు ఆఫీసులకు వెళ్లిపోయిన తర్వాత వికృతంగా మారిపోయి చిన్నారిని ఇష్టం వచ్చినట్టు చితకబాదడాన్ని చూసి బాలుడి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు.

 బాలుడి జుట్టు పట్టుకుని ఈడ్చి పడేయడం, మంచంపై పడేసి పొట్టలో ఇష్టం వచ్చినట్టు పిడిగుద్దులు కురిపించడం చూసి షాకయ్యారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయా రజినీని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగింది.
Madhya Pradesh
Jabalpur
Nanny
Boy
Viral Videos

More Telugu News