Anand Mahindra: ఆనంద్ మహీంద్రాకు ఆర్బీఐ డైరెక్టర్ పదవి

  • మరో ముగ్గురిని కూడా డైరెక్టర్లుగా నియామకం
  • జూన్ 14 నుంచి వర్తింపు
  • నాలుగేళ్ల పాటు పదవీకాలం
Anand Mahindra appointed as RBI non official director

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బోర్డులో డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆనంద్ మహీంద్రాతో పాటు పంకజ్ పటేల్, వేణు శ్రీనివాసన్, మాజీ ఐఐఎం ప్రొఫెసర్ రవీంద్ర ఢోలాకియాలకు ఆర్బీఐ బోర్డులో పార్ట్ టైమ్ నాన్ అఫిషియల్ డైరెక్టర్లుగా స్థానం కల్పించింది. ఈ నియామకాలు జూన్ 14 నుంచి నాలుగేళ్ల పాటు వర్తిస్తాయి. పదవీకాలం పూర్తయ్యేంతవరకు, లేదా ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు వీరు ఆర్బీఐ బోర్డులో కొనసాగుతారు. 

ఆనంద్ మహీంద్రా భారత్ లో అగ్రగామి వ్యాపారవేత్తలలో ఒకరిగా ఉన్నారు. అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహీంద్రా గ్రూప్ కు ఆయన చైర్మన్. 2020లో ఆయనకు పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది. 

ఇక, వేణు శ్రీనివాసన్ టీవీఎస్ మోటార్ కంపెనీకి గౌరవ చైర్మన్. టీవీఎస్ మోటార్ కు మాతృ సంస్థ అయిన సుందరం-క్లేటన్ సంస్థకు సీఈవోగా ఆయన 1979లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు అందుకున్న ఏడాదే టీవీఎస్ మోటార్ కంపెనీ ఆవిర్భవించింది. 

పంకజ్ పటేల్ జైడస్ లైఫ్ సైన్సెస్ సంస్థకు చైర్మన్. ఆయన ఇప్పటికే ఇన్వెస్ట్ ఇండియా బోర్డు సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగానూ కొనసాగుతున్నారు. 

రవీంద్ర ఢోలాకియా అహ్మదాబాద్ ఐఐఎంలో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైరయ్యారు. రిజర్వ్ బ్యాంక్ మనీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లోనూ సేవలు అందించారు. ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, ఆర్థిక విశ్లేషణ, ఆర్థిక విధానం, అంతర్జాతీయ ఆర్థిక అంశాలు, ఆరోగ్య ఆర్థిక అంశాల్లో ఆయనకు అనేక ఏళ్ల విస్తృత అనుభవం ఉంది.

More Telugu News