Kerala High Court: స్త్రీపురుషులు దీర్ఘకాలం కలిసుంటే పెళ్లయినట్టే: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

kerala high court verdict dismissed supreme court on live in relation
  • సహ జీవనం చేస్తున్న జంటకు పుట్టిన బిడ్డను అక్రమ సంతానంగా పేర్కొన్న కేరళ హైకోర్టు
  • పూర్వీకుల ఆస్తిలో వాటా రాదని తీర్పు
  • కేరళ హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం ధర్మాసనం
స్త్రీపురుషుల సహజీవనంపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వారిమధ్య దీర్ఘకాలంగా సహజీవనం కొనసాగితే దానిని అక్రమ సంబంధంగా భావించకూడదని, దానిని వివాహ బంధంగానే పరిగణించాలని పేర్కొంది. అంతేకాదు, వారికి పుట్టిన సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా కూడా ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. 

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఓ జంట దీర్ఘకాలంగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో వారికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే, వీరు వివాహం చేసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారికి పుట్టిన బాబును అక్రమ సంతానంగా పేర్కొంటూ పూర్వీకుల ఆస్తిలో అతడికి వాటా దక్కదని స్పష్టం చేస్తూ కేరళ హైకోర్టు 2009లో తీర్పు నిచ్చింది.

దీంతో బాధిత జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా వీరి పిటిషన్‌ను జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేరళ హైకోర్టు తీర్పుతో విభేదించింది. ఓ జంట దీర్ఘకాలంగా సహజీవనం చేస్తుంటే వారు వివాహం చేసుకున్నట్టుగానే పరిగణించాలని పేర్కొంది. వారు పెళ్లి చేసుకోలేదని విస్పష్టంగా రుజువైతే తప్ప వారి బంధాన్ని భార్యాభర్తల్లానే పరిగణించాలని స్పష్టం చేసింది. 

అయితే, వారు పెళ్లి చేసుకోలేదని నిరూపించాల్సిన బాధ్యత మాత్రం సవాల్ చేసిన వారిపైనే ఉంటుందని పేర్కొంది. అలాగే, ఆస్తి పంపకం దావాల్లో ప్రాథమిక డిక్రీ ఇచ్చిన వెంటనే తుది డిక్రీ జారీకి చర్యలు ప్రారంభించాలంటూ అన్ని కోర్టులను సుప్రీం ఆదేశించింది.
Kerala High Court
Supreme Court
Live In Relation

More Telugu News