Congress: తొలి రోజు 10 గంట‌ల‌ విచార‌ణ‌... రేపు కూడా ఈడీ విచార‌ణ‌కు రాహుల్ గాంధీ

  • నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచార‌ణ‌కు రాహుల్ గాంధీ
  • తొలి రోజైన సోమ‌వారం 10 గంట‌ల పాటు విచార‌ణ‌
  • రాహుల్ గాంధీపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన ఈడీ
  • ప్ర‌శ్న‌ల‌కు లిఖిత‌పూర్వకంగా స‌మాధానాలిచ్చిన రాహుల్‌
ed grilled rahul gandhi for 10 hours in first day and tomorrow continues questionng

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు తొలి రోజైన సోమవారం ఏకంగా 10 గంట‌ల పాటు విచారించారు. సోమ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు రాహుల్ గాంధీ ఈడీ కార్యాల‌యానికి వెళితే, మధ్యలో లంచ్ కోసం ఓ గంట పాటు ఆయనను బయటకు అనుమతించారు. తర్వాత మళ్లీ విచారణ కొనసాగి, రాత్రి 9.30 గంట‌ల‌కు ఆయ‌న ఈడీ కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ విధంగా రాహుల్‌ను ఏకంగా 10 గంట‌ల పాటు విచారించారు. 

తొలి రోజు సుదీర్ఘంగా సాగిన‌ విచార‌ణ‌లో భాగంగా ఈడీ అధికారులు రాహుల్ గాంధీపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన‌ట్లు స‌మాచారం. ఈడీ అధికారులు అడిగిన దాదాపుగా అన్ని ప్ర‌శ్న‌ల‌కు రాహుల్ లిఖిత‌పూర్వ‌కంగానే స‌మాధానాలు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో రాహుల్ స‌మాధానాల‌ను ఆయ‌న వ్య‌క్తిగ‌త సాక్ష్యాలుగా ప‌రిగ‌ణించే దిశ‌గా ఈడీ అధికారులు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. 

ఇదిలా ఉంటే.. రేపు కూడా విచార‌ణ‌కు రావాలంటూ ఈడీ అధికారులు రాహుల్ గాంధీకి ఆదేశాలు జారీ చేశారు. తొలి రోజు విచార‌ణ ముగిసిన స‌మ‌యంలో ఈ మేర‌కు వారు రాహుల్‌కు స‌మ‌న్లు అంద‌జేశారు. దీంతో మంగ‌ళ‌వారం కూడా రాహుల్ గాంధీ ఈడీ విచార‌ణ‌కు హాజ‌రు కానున్నారు.

More Telugu News