Team India: సఫారీలతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపై ఎవరేమన్నారంటే..!

We were 10 to15 runs short Pant after defeat vs SA
  • మరో 10-15 పరుగులు చేసి ఉండాల్సిందన్న పంత్
  • రెండో అర్ధ భాగంలో మ్యాచ్‌పై పట్టు కోల్పోయామని వివరణ 
  • క్లాసెన్ ఒకటి రెండు బంతుల్లోనే ప్రత్యర్థిని దెబ్బతీస్తాడన్న బవుమా
  • స్పిన్నర్లను టార్గెట్ చేశానన్న క్లాసెన్
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గత రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. సఫారీ బ్యాటర్ క్లాసెన్ క్లాస్ ఇన్నింగ్స్‌తో మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి 149 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో సఫారీలు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. 

ఈ ఓటమిపై భారత స్కిప్పర్ రిషభ్ పంత్ మాట్లాడుతూ.. తాము మరో 10-15 పరుగులు చేసి ఉండాల్సిందని అన్నాడు. తొలి ఏడెనిమిది ఓవర్లలో భువనేశ్వర్ కుమార్, ఇతర పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. అయితే, ఆ తర్వాత మాత్రం అనుకున్న మేర రాణించలేక మ్యాచ్‌పై పట్టుకోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. రెండో అర్ధ భాగంలో వికెట్లు అవసరమైన వేళ వాటిని సాధించలేకపోయామని పంత్ చెప్పుకొచ్చాడు.

సఫారీ కెప్టెన్ తెంబా బవుమా (35), క్లాసెన్ (81) అద్భుతంగా బ్యాటింగ్ చేశారన్నాడు. తర్వాతి గేమ్‌లోనైనా తమ బౌలింగును మెరుగుపర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. మిగిలిన మూడు గేముల్లోనూ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంటామని పంత్ ధీమా వ్యక్తం చేశాడు. 

ప్రొటీస్ కెప్టెన్ బవుమా మాట్లాడుతూ.. ఇదో గమ్మత్తయిన చేజింగ్ అని అన్నాడు. భువీ బాగా బౌలింగ్ చేశాడన్నాడు. చేజింగ్ అంత ఈజీ కాదన్న విషయం తమకు తెలుసని పేర్కొన్నాడు. అయితే, తమ ప్రణాళికలను కచ్చితంగా అమలు చేస్తే విజయం సాధించడం సులభమేనన్న నమ్మకంతో ఉన్నామని బవుమా చెప్పుకొచ్చాడు. ఐదు, లేదంటే ఆరో స్థానంలో తాము మిల్లర్‌ను ఉపయోగించుకోవచ్చని, కాకపోతే క్లాసెన్ ఒకటి రెండు బంతుల్లోనే ప్రత్యర్థిని తీవ్రంగా దెబ్బతీయగలడని అన్నాడు. అతడు తమ బ్యాటింగ్‌కు మరింత విలువను జోడించాడని ప్రశంసించాడు. ఈ మ్యాచ్ నుంచి తాను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్న బవుమా.. తర్వాతి మ్యాచ్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తానన్నాడు.  

 కొత్త బంతిని ఎదుర్కోవడం కష్టమనిపించిందని, అందుకనే స్పిన్నర్లను టార్గెట్ చేసేందుకు ప్రయత్నించానని ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్లాసెన్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించినందుకు సంతోషంగా ఉందన్నాడు. ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అందుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పాడు. జట్టు సిబ్బంది నుంచి తగినంత మద్దతు లభించినందుకు చాలా సంతోషంగా ఉందని క్లాసెన్ పేర్కొన్నాడు.
Team India
South Africa
Rishabh Pant
Temba Bavuma
Heinrich Klaasen

More Telugu News