KCR: జాతీయ పార్టీగా మారనున్న టీఆర్ఎస్.. ఈ నెలాఖరులో ప్రకటించనున్న కేసీఆర్!

TRS to become national party
  • జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి
  • జాతీయ పార్టీపై ఈ నెల 19న తుది నిర్ణయం
  • బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా దేశ రాజకీయాల్లోకి
  • నేతలతో సుదీర్ఘ చర్చ అనంతరం నిర్ణయం
జాతీయ రాజకీయాలపై ఇటీవల దృష్టి సారించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర చాటాలని ఉవ్విళ్లూరుతున్న ఆయన కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని పట్టుదలగా ఉన్నారు.

ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పర్యటించారు కూడా. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను జాతీయ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా మారాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

ఈ నెల 19న జరగనున్న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో జాతీయ పార్టీ విషయంలో తుది నిర్ణయం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలతో నిన్న ప్రగతి భవన్‌లో ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశంలో దేశ రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ పోషించబోతున్న పాత్రపైనా చర్చ జరిగింది. దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో మనం కీలక పాత్ర పోషిద్దామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నట్టు తెలుస్తోంది.

పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యల గురించి చర్చ జరగడం లేదని, మాట్లాడదామంటే ‘జైశ్రీరాం’ నినాదాలతో అడ్డుకుంటున్నారని, రాజకీయ లబ్ధికోసం మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆక్షేపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 97 శాతం అపజయాలు మూటగట్టుకుందని గుర్తు చేశారు. కాబట్టి దేశ ప్రజల అవసరాలు తీర్చేందుకు జాతీయ పార్టీని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్దామని నేతలతో కేసీఆర్ అన్నట్టు సమాచారం.

జాతీయ పార్టీ ఏర్పాటు చేద్దామన్న కేసీఆర్ ప్రతిపాదనకు నేతలు కూడా ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19 లోగా కార్యవర్గ సమావేశం నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చే విషయంలో తుది నిర్ణయం ప్రకటించనున్నారని, నెలాఖరులో ఢిల్లీలో పార్టీని ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
KCR
TRS
BRS
Bharata Rashtra Samithi
Telangana

More Telugu News