Police: కోల్ కతాలో విచ్చలవిడిగా కాల్పులు జరిపిన పోలీసు... మహిళ మృతి

Police fire at will in Kolkata caused to death of a woman
  • బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయానికి చేరువలో ఘటన
  • తుపాకీతో రోడ్డుపైకి వచ్చిన పోలీసు
  • 15 రౌండ్ల వరకు కాల్పులు
  • ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య
కోల్ కతాలో ఓ పోలీసు విచ్చలవిడిగా కాల్పులు జరిపి, ఆపై తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయానికి సమీపంలోని పార్క్ సర్కస్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆర్మ్ డ్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చోదప్ లేప్చా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 

మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తుపాకీతో విచక్షణరహితంగా 10 నుంచి 15 రౌండ్లు కాల్పులు జరిపాడు. వీటిలో ఓ బుల్లెట్ దారినపోతున్న మహిళ వెన్నెముకను ఛిద్రం చేస్తూ దూసుకెళ్లింది. ఆ మహిళ బుల్లెట్ గాయంతో ప్రాణం విడిచింది. అనంతరం గడ్డం కింద తుపాకీ పెట్టుకుని ఆ కానిస్టేబుల్ తనను తాను కాల్చుకున్నాడని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. 

చోదప్ లేప్చా ఇటీవల సెలవుపై వెళ్లి శుక్రవారమే తిరిగి విధుల్లో చేరాడు. తుపాకీ చేతబట్టి ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చిన అతను... పెద్దగా కేకలు వేస్తూ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గాయపడిన ఓ వ్యక్తికి ఇక్కడి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆ కానిస్టేబుల్ తుపాకీతో రోడ్డు మీదికి రాగా, అతడేదో బొమ్మ తుపాకీతో తమాషా చేస్తున్నాడని స్థానికులు భావించారు. 

అయితే ఆ తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్లు ఓ కారును తాకగా, ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నాడు. నిజమైన కాల్పులే అని అర్థంకాగా, అక్కడి వాళ్లు హడలిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. చోదప్ లేప్చా ఫస్ట్ బెటాలియన్ కు చెందిన ఆర్మ్ డ్ కానిస్టేబుల్ అని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
Police
Firing
Woamn
Death
Kolkata

More Telugu News