Nani: మూవీ రివ్యూ: 'అంటే .. సుందరానికీ!'

  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'అంటే .. సుందరానికీ'
  • వినోదమే ప్రధానంగా సాగే కథ 
  • ఫస్టాఫ్ లో తగ్గిన స్పీడ్ 
  • ప్రధాన బలంగా నిలిచిన కామెడీ
  • రొమాంటిక్ సీన్స్ .. సాంగ్స్ లేకపోవడమే లోపం
  • బలమైన అంశాన్ని సున్నితంగా చెప్పిన దర్శకుడు
Ante Sundaraniki movie review

నాని కథానాయకుడిగా దర్శకుడు వివేక్ ఆత్రేయ 'అంటే .. సుందరానికీ' సినిమాను రూపొందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. పూర్తి వినోదభరితమైన ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. నజ్రియా కథానాయికగా పరిచయమైన ఈ సినిమాలో నరేశ్ .. నదియా .. రోహిణి .. అనుపమ పరమేశ్వరన్ .. హర్షవర్ధన్ ..  ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ రోజునే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పూర్తి ఎంజాయ్ మెంట్ ను ఇస్తుందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని చెప్పాడు. ఆడియన్స్ నిజంగానే అలా ఫీలయ్యారా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.

కులమతాలకు  .. ఆచార వ్యవహారాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే రెండు వేరు వేరు కులాలకు చెందిన యువతీ యువకులు ప్రేమించుకుంటే .. పెళ్లికి పెద్దలను ఒప్పించడం కోసం రెండు అబద్ధాలు ఆడితే .. వాటి పర్యవసనాలు ఎలా ఉంటాయి? అనేదే ఈ కథ. 

శాస్త్రి దంపతులు (నరేశ్ - రోహిణి) ఆచార వ్యవహారాలను ఎంతో కఠినంగా పాటిస్తూ ఉంటారు. వాళ్ల ఒక్కగానొక్క సంతానమే సుందరం (నాని). ఇక థామస్ ఫ్యామిలీ (నదియా దంపతులు)కి కూడా మతపట్టింపులు ఎక్కువే. వాళ్ల రెండవ అమ్మాయినే లీలా థామస్ (నజ్రియా). సుందరం - లీల ఇద్దరూ స్కూల్ ఏజ్ లో కలిసి చదువుకుంటారు. పరిస్థితులు వాళ్లు ప్రేమలో పడేలా చేస్తాయి. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే సంగతి వాళ్లకి తెలుసు. అందువలన సుందరం బాగా ఆలోచన చేసి ఒక ప్లాన్ వేస్తాడు. తనకి సంతానం కలగదని తల్లిదండ్రులను నమ్మిస్తాడు. అయినా ఫరవాలేదంటూ తనని పెళ్లి చేసుకుకోవడానికి లీల ముందుకు వస్తే, అప్పుడు వాళ్లు  ఒప్పుకునే అవకాశం ఉందని భావిస్తాడు. 

అలాగే తాను గర్భవతిననీ .. అందుకు కారణం సుందరమేనని లీలతో ఆమె ఇంట్లో చెప్పిస్తాడు. పెద్ద కూతురు విషయంలో ఒక సమస్యను ఫేస్ చేస్తున్న ఆ దంపతులు తప్పకుండా తమ పెళ్లికి అంగీకరిస్తారని ఆశిస్తాడు. ఇద్దరూ బాగా ఆలోచించుకుని ఆ ప్లాన్ ను ఆచరణలో పెడతారు.

వాళ్ల ప్లాన్ ప్రకారం .. తమ కూతురు గర్భవతి కావడానికి కారణమైన సుందరంతోనే ఆమె పెళ్లి జరిపించాలని లీలా పేరెంట్స్ అనుకోవాలి. అలాగే తమ కొడుక్కి సంతానం కలగదని తెలిసి కూడా లీల పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చిందనే సంతోషంతో సుందరం తల్లిదండ్రులు ఆ పెళ్లికి ఒప్పుకోవాలి. కానీ అనుకోని సంఘటన కారణంగా వాళ్ల ప్లాన్ ట్రాక్ తప్పుతుంది. ఇక అక్కడి నుంచి కథ మరింత రసవత్తరంగా మారుతుంది.  

ఈ సినిమా చూస్తుంటే .. కులమతాల పట్టింపులు .. అలాంటి కుటుంబాలకి చెందిన యువతీ యువకులు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందనేది దర్శకుడు జంధ్యాల గతంలోనే హాస్యభరితంగా తెరకెక్కించిన సినిమాలు ఒకటి రెండు గుర్తొస్తాయి. ఇక ఈ సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ ఆ తరహా దారిలో కొంతవరకూ వెళ్లినా .. ఆ తరువాత రూటు మార్చాడు .. కథలోని రెండు కుటుంబాలవారితో పాటు థియేటర్లలో ఉన్నవారిని కూడా కాసేపు టెన్షన్ పెట్టాడు .. అలా తనదైన ట్రీట్మెంట్ తో చివరివరకూ లాక్కొచ్చాడు. 

 తమ కొడుకు లైఫ్ లోకి ఓ క్రిస్టియన్ అమ్మాయి ప్రవేశించిందని శాస్త్రి ఫ్యామిలీ ..  తమ అమ్మాయి ఓ బ్రాహ్మణ యువకుడిని ప్రేమించిందని థామస్ ఫ్యామిలీకి తెలిసే సన్నివేశాలను ఆత్రేయ చిత్రీకరించిన తీరు బాగుంది. ఇక లీల ప్రెగ్నెంట్ అని ఆమె పేరెంట్స్ ను ఒప్పించడం కోసం .. తాను సంసారానికి పనికిరాననే అబద్ధంతో తన పేరెంట్స్ ను నమ్మించడానికి సుందరం పడే అవస్థలు హాయిగా నవ్విస్తాయి. సుందరానికి పిల్లలు పుట్టరనే విషయాన్ని ఒక డాక్టర్ గా నరేశ్ కి రాహుల్ రామకృష్ణతో చెప్పించిన కామెడీ సీన్ పడి పడి నవ్విస్తుంది.

ఇక తమ పిల్లలు తమతో చెబుతున్నది నిజమో .. కాదో తాము టెస్టు చేయించి తేల్చుకోవాలని సుందరం - లీల పేరెంట్స్ నిర్ణయించుకోవడంతో కథలో టెన్షన్ మొదలవుతుంది. అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరుగుతూ .. ఒకే ఒక్క ట్విస్టుతో ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది. అదేమిటనేది తెరపై చూస్తూ ..  ఈ టెన్షన్ ను అనుభవిస్తేనే బాగుంటుంది. వివేక్ ఆత్రేయ రాసుకున్న కథ సరదాగా ఉంది .. ఆయన వేసుకున్న స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సాగింది. హీరోహీరోయిన్లు పెద్దయిన తరువాత కూడా వారి చిన్నప్పటి పాత్రలను వాళ్లతో కలిపి నడిపించిన విధానం కొత్తగా అనిపిస్తుంది.

అలాగే నానీ .. ఆయన బాస్ హర్షవర్ధన్ కి మధ్య సీన్స్ కూడా బాగానే పండాయి. ఫస్టాఫ్ లో కథ కాస్త స్లో అయినట్టుగా అనిపించినా, సెకండాఫ్ లో మాత్రం కథ దూకుడుగా వెళుతుంది. వివేక్ ఆత్రేయ ఆయా పాత్రలను మలచిన తీరు ఎంతో సహజంగా అనిపిస్తుంది. రెండు కుటుంబాల కథను ఎదురింట్లో ఉండి చూస్తున్న అనుభూతి కలుగుతుంది. క్లైమాక్స్ కూడా కథకి తగినదనే సంతృప్తి కలుగుతుంది. అక్కడక్కడా కాస్త అనవసరమైన హడావిడి చేశాడని అనిపించినా, సాధ్యమైనంత వరకూ సమయాన్ని వృథా చేయకుండా కథను పరిగెత్తించడానికే ప్రయత్నించాడు. 

నాని .. నజ్రియా .. నరేశ్ .. నదియా .. రోహిణి .. ఇలా ఎవరి పాత్రకి వాళ్లు పూర్తి న్యాయం చేశారు. నజ్రియాలో మునుపటి గ్లామర్ లేదు .. ఆమె మాత్రమే ఈ పాత్రను చేయగలదు అని చెప్పారు గానీ .. అంతగా ఏమీ అనిపించదు. ఇంకా నాని కొలీగ్ లా అనుపమ పరమేశ్వరన్ చాలా అందంగా ... ఆకర్షణగా అనిపించింది. నాని చిన్నప్పటి పాత్రలో శేఖర్ మాస్టర్ కొడుకు బాగా చేశాడు .. డాన్సుల్లోను మెప్పించాడు. 

ఇక పాటలు కథలో భాగంగా వచ్చి సందడి చేస్తాయి. డ్యూయెట్లు లేవు .. ఉన్న పాటలు గుర్తుండవు. వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగానే ఉంది. ఫొటోగ్రఫీకి .. ఎడిటింగ్ కి మంచి మార్కులే పడతాయి. వివేక్ ఆత్రేయ ఎంచుకున్న లైన్ కాస్త క్లిష్టమైనదే అయినా, సున్నితంగా ఆయన ఈ కథను డీల్ చేసిన తీరు బాగుంది. రొమాంటిక్ సీన్స్ .. డ్యూయెట్లు లేకపోవడమనే లోపాన్ని పక్కన పెడితే, సరదాగా కాసేపు నవ్వుకోవాలనుకునేవారికి ఈ సినిమా ఓకే.  

--- పెద్దింటి గోపీకృష్ణ  


More Telugu News