గద్ద ప్రాణం కాపాడదామనుకుంటే.. ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు

10-06-2022 Fri 11:06
  • ముంబైలోని బాంద్రా-వర్లి సీలింక్ పై ప్రమాదం
  • రోడ్డుపై ఉన్న ఇద్దరినీ ఢీకొట్టి వెళ్లిపోయిన ట్యాక్సీ
  • ప్రమాద స్థలంలో ఒకరు, ఆసుపత్రిలో మరొకరి మృతి
driver stop to rescue eagle killed as taxi ploughs into them on Mumbai Sea Link
ఒక గద్ద ప్రాణం కోసం ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు బలైపోయాయి. ముంబై నగరంలోని బాంద్రా-వర్లి సముద్ర మార్గం (సీలింక్/భారీ పొడవైన వంతెన)పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మే 30న జరిగిన ఈ ప్రమాదాన్ని ఓ సందర్శకుడు తన కెమెరాలో చిత్రీకరించారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

43 ఏళ్ల అమర్ మనీష్ జరీవాలా మలద్ కు కారులో వెళుతున్నారు. సీలింక్ పై ప్రయాణిస్తున్న సమయంలో ఓ గద్ద ఉన్నట్టుండి వారి కారు కింద చిక్కుకుపోయింది. దీంతో కారు ఆపాలంటూ డ్రైవర్ శ్యామ్ సుందర్ కామత్ ను జరీవాలా కోరాడు. ఇద్దరూ కారు దిగి నడిరోడ్డుపై నించున్నారు. కారు కింద ఉన్న గద్దను ఎలా కాపాడదామని ఆలోచిస్తున్న తరుణంలో ఓ కారు వేగంగా వెనుక నుంచి వచ్చి ఇద్దరినీ ఢీకొట్టి ముందుకు వెళ్లిపోయింది. 

కారు ఢీకొట్టిన వేగానికి ఇద్దరూ చెరో వైపు ఎగిరి పడ్డారు. జరీవాలా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కామత్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా అక్కడ తుది శ్వాస విడిచాడు. వంతెనపై వీరు గద్దను కాపాడదామన్న ఆలోచనలోనే ఉండిపోయారు తప్పించి.. వెనుక నుంచి వచ్చే కార్లను చూసుకోకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ విషయంలో ట్యాక్సీ డ్రైవర్ తప్పిదం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ట్యాక్సీ డ్రైవర్ ముందున్న ఇద్దరినీ అసలు చూసుకోకుండా వెళ్లడాన్ని వీడియోలో గమనించొచ్చు. పోలీసులు ట్యాక్స్ డ్రైవర్ పై కేసు దాఖలు చేశారు.