MIM: శివసేనతో చేయి కలిపిన ఎంఐఎం!

  • మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికల్లో శివసేన కూటమికి ఎంఐఎం మద్దతు
  • బీజేపీ ఓటమే లక్ష్యంగా కూటమికి మద్దతు
  • శివసేనతో సిద్ధాంతపరమైన విభేదాలు కొనసాగుతాయని వ్యాఖ్య
MIM join hands with Shiv Sena in Maharashtra in Rajya Sabha elections

రాజకీయాల్లో ప్రత్యర్థిని చిత్తు చేయడమనేది చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు అవసరానికి తగ్గట్టుగా తమ నిర్ణయాలను మార్చుకుంటూ ముందుకు సాగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. తన ప్రధాన రాజకీయ శత్రువు బీజేపీని ఓడించడానికి హిందుత్వ పార్టీ శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమితో ఎంఐఎం చేయి కలిపింది.   

మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఈ కూటమిలోని కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. ఈ మేరకు ఎంఐఎంకు చెందిన ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే, శివసేనతో తమకున్న సిద్ధాంతపరమైన విభేదాలు మాత్రం ఇకపై కూడా కొనసాగుతాయని ఆయన అనడం కొసమెరుపు. 

తమ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ధూలియా, మాలేగావ్ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన కొన్ని సూచనలను ప్రభుత్వానికి చేశామని ఇంతియాజ్ చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశామని తెలిపారు. ఏదేమైనప్పటికీ శివసేన కూటమితో ఎంఐఎం చేతులు కలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

More Telugu News