Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. హైదరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం

  • జువైనల్ జస్టిస్ బోర్డుకు హైదరాబాద్ పోలీసులు
  • మైనర్ నిందితులను మేజర్లుగా పరిగణించి విచారణకు అనుమతించాలని అభ్యర్థన
  • బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్ర ఉత్కంఠ
  • నిందితుల్లో ఐదుగురు మైనర్లే.. ఇప్పటికే బెయిలుకు దరఖాస్తు
Jubilee hills ganga rape case Police want juvenile accused to be tried as adults

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను మేజర్లుగా పరిగణించి విచారించేందుకు జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతి కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ధ్రువీకరించారు. 

అయితే, పోలీసుల విజ్ఞప్తిని బోర్డు అనుమతిస్తుందా? లేదా? అన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. బోర్డు కనుక నిందితులైన మైనర్లను విచారించేందుకు అనుమతిస్తే ఈ కేసులో రహస్యంగా మిగిలిపోయిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మైనర్ల మానసిక స్థితి, నేర స్వభావం, నేరం చేయగలిగే సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని జువైనల్ బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 

బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒక్కరు మినహా మిగతా ఐదుగురు మైనర్లేనని పోలీసులు చెబుతున్నారు. మేజర్ అయిన నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించగా, మిగిలిన వారిని జువైనల్ హోంకు తరలించారు. మైనర్లు ఇప్పటికే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో మైనర్ నిందితులను మేజర్లుగా పరిగణించాలని కోరుతూ హైదరాబాద్ పోలీసులు జువైనల్ బోర్డును కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More Telugu News