Telangana: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే.. మూడు నెలలపాటు లైసెన్స్ రద్దు

Driving license Cancelled if anyone caught on drunken drive
  • సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయనున్న ట్రాఫిక్ పోలీసులు
  • ఒకసారి పట్టుబడితే ఆ తర్వాత చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక
  • మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలుకు తల్లిదండ్రులు
రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ ప్రతిపాదించిన మార్గదర్శకాలను తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసు అధికారులు నిర్ణయించారు. దీని ప్రకారం ఇకపై మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడితే వారి వివరాలను కోర్టుకు సమర్పించి లైసెన్స్ రద్దు ఉత్తర్వులను రవాణాశాఖకు పంపుతారు. ఫలితంగా మూడు నెలలపాటు వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుంది.

ఒకసారి పట్టుబడిన వ్యక్తులు భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. కోర్టులో ప్రతి కేసు నమోదవుతుందని, జైలుకు వెళ్తే ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా విదేశాలకు వెళ్లే వీలు కూడా ఉండదన్నారు. అలాగే, డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడినప్పుడు తీవ్రత ఆధారంగా లైసెన్స్ శాశ్వతంగానూ రద్దు అయ్యే అవకాశం ఉంటుందన్నారు.

మరోవైపు, వాహనాలు నడుపుతూ మైనర్లు పట్టుబడితే మోటారు వాహన చట్టం ప్రకారం వారి తల్లిదండ్రులను కూడా జైలుకు పంపించనున్నారు. వాహనాలను వేగంగా నడుపుతూ ప్రమాదాలు చేయడంతోపాటు కిడ్నాప్‌లు, అత్యాచారాలకు కార్లను వినియోగిస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడడమే కాకుండా సీసీ కెమెరాలకు చిక్కినా వారిపై కేసు నమోదు చేయనున్నారు.
Telangana
Hyderabad
Traffic Rules
Mionrs
Drivers License

More Telugu News