Tammineni Sitaram: మీటర్ సిస్టమ్ ను ప్రవేశ పెట్టిందే చంద్రబాబు: స్పీకర్ తమ్మినేని సీతారాం

Chandrababu introduced electricity meters says Tammineni Sitaram
  • కొత్త మీటర్లను బిగించలేకపోతే విద్యుత్ ను ఆదా చేయలేమన్న స్పీకర్ 
  • సిస్టమ్ ను కరెక్ట్ చేసి నాణ్యమైన విద్యుత్ ను రైతులకు అందిస్తే తప్పేముందని ప్రశ్న 
  • రైతు భరోసా కేంద్రాలను సందర్శించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు వస్తున్నారని వ్యాఖ్య 
ఏపీ ప్రభుత్వం వ్యవసాయానికి కొత్త మీటర్లను బిగిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మీటర్లు బిగించవద్దని టీడీపీ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు గుప్పించారు. అసలు మీటర్ సిస్టమ్ ను ప్రవేశ పెట్టిందే చంద్రబాబు అని అన్నారు. 'మీటర్ సిస్టమ్ ను ప్రవేశ పెట్టలేదని చంద్రబాబును అనమడండి' అని సవాల్ విసిరారు. కొత్త మీటర్లను బిగించలేకపోతే విద్యుత్ ను ఆదా చేసుకోలేమని తెలిపారు. సిస్టమ్ ను కరెక్ట్ చేసి నాణ్యమైన విద్యుత్ ను రైతులకు అందించడంలో తప్పేముందని ప్రశ్నించారు. 

గతంలో ప్రభుత్వ పెద్దలు వారికి నచ్చిన కంపెనీల వద్ద ముందే మాట్లాడుకుని అక్కడకు వెళ్లాలని రైతులకు చెప్పేవారని తమ్మినేని అన్నారు. కానీ ఇప్పుడు రైతులు వారికి నచ్చిన యంత్రాలు, ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. గతంలో లంచాలు ఇవ్వనిదే వాహనాలు వచ్చే పరిస్థితి లేదని... ఇప్పుడు నేరుగా ప్రజలకు లబ్ధి చేకూరుతోందని అన్నారు. ఏపీలోని రైతు భరోసా కేంద్రాలను సందర్శించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంపై అనవసర విమర్శలను మానుకోవాలని విపక్షాలకు హితవు పలికారు.
Tammineni Sitaram
YSRCP
Chandrababu
Telugudesam
Electricity meters

More Telugu News