Devineni Uma: మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన దేవినేని ఉమ

  • టీడీపీ, వైసీపీ మధ్య ఫేక్ ట్వీట్ రగడ
  • తన ట్విట్టర్ అకౌంట్ మార్ఫింగ్ చేశారన్న ఉమ
  • దీని వెనుక జగన్, సజ్జల ఉన్నారని ఆరోపణ
Devineni Uma complains against Ambati Rambabu

టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఫేక్ ట్వీట్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నేడు సీఐడీ కార్యాలయానికి వెళ్లి, మంత్రి అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేశారు. ఫేక్ ట్వీట్లను ప్రచారం చేస్తూ విద్వేషాలు పెంచుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ట్విట్టర్ ఖాతాను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేశారని దేవినేని ఉమ ఆరోపించారు. ఫేక్ ట్వీట్ ను తనకు ట్యాగ్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. 

ఫేక్ ట్వీట్ల వెనుక జగన్, సజ్జల ఉన్నారని ఉమ ఆరోపించారు. నేరపూరిత కుట్ర ఆరోపణలపై సెక్షన్ల కింద జగన్, సజ్జల, అంబటిపై చర్యలు తీసుకోవాలని సీఐడీని కోరినట్టు తెలిపారు. కులాల మధ్య, పార్టీల మధ్య విద్వేషాలు రగిల్చేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. 

గౌతు శిరీష వంటి టీడీపీ నేతలను, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ ట్వీట్ అంశంపై మౌనంగా ఉన్న అంబటి రాంబాబు తప్పు అంగీకరించినట్టుగానే భావిస్తున్నామని అన్నారు. మహానాడు విజయవంతం అయినందునే తమపై ఈ కుయుక్తులకు పాల్పడుతున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.

More Telugu News