Harish Rao: మరో 1,433 పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ ఆమోదం

  • టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ
  • మొత్తం భర్తీ చేసే ఉద్యోగాల్లో 657 ఏఈఈ, 113 ఏఈ పోస్టులే
  • వైద్యారోగ్య శాఖలో భర్తీకీ నోటిఫికేషన్
  • అధికారులను ఆదేశించిన మంత్రి హరీశ్
Telangana Finance Department Okays For Another 1433 posts Recruitment

మరో 1,433 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ పరిపాలనా అనుమతులను ఇచ్చింది. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల్లో ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపింది. మొత్తం భర్తీ చేసే ఉద్యోగాల్లో 657 ఏఈఈ, 113 ఏఈ పోస్టులే ఉండడం గమనార్హం. వాటితో పాటు హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఏఎస్ వో తదితర పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 

కాగా, 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ శాసనసభలో సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే గ్రూప్ 1 సహా ఇప్పటిదాకా వివిధ శాఖల్లో 33,787 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వాటికి సంబంధించి కొన్ని నోటిఫికేషన్లూ విడుదలయ్యాయి. పోలీస్, గ్రూప్ 1 పోస్టుల నోటిఫికేషన్ గడువు ముగిసింది. 

తాజాగా మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల్లో 1,433 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో.. మొత్తంగా 35,220 పోస్టులకు అనుమతినిచ్చినట్టయింది. ఇక, వైద్యారోగ్య శాఖలో 12,775 ఉద్యోగాలను విడతల వారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 10,028 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. తొలి విడతలో ఎంబీబీఎస్ అర్హత ఉన్న 1,326 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మిగిలిన శాఖల్లోని ఖాళీల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

More Telugu News