Rishabh Pant: రిషబ్ పంత్.. వికెట్ కీపర్ అవ్వడానికి వెనుక ఒక కారణం!

  • పంత్ తండ్రి కూడా వికెట్ కీపరే
  • దాంతో పంత్ కెరీర్ సైతం వికెట్ కీపింగ్ తో మొదలు
  • చురుగ్గా ఉంటేనే రాణిస్తామన్న రిషబ్ 
  • వికెట్ కీపర్ బ్యాట్స్ మ్యాన్ గా ఉండేందుకే ఇష్టపడతానని వెల్లడి 
Rishabh Pant Reveals How He Chose Wicket Keeping

ధోనీ తర్వాత భారత జట్టుకు వికెట్ కీపర్ గా సేవలు అందిస్తున్న రిషబ్ పంత్.. తను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక విశేషాలను పంచుకున్నాడు. 2016 ప్రపంచకప్ అండర్ 19 జట్టుకు పంత్ ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2017లో టీమిండియాలో చోటు సంపాదించుకున్నాడు. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు అతడు కెప్టెన్ గా ప్రస్తుతం సేవలు అందిస్తున్నాడు. 

కెరీర్ ఆరంభంలో వికెట్ కీపర్ గా పంత్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎంఎస్ ధోనీ స్థాయి ప్రమాణాలను అతడు చూపించలేకపోవడమే అందుకు కారణం. క్యాచ్ లను వదిలేయడం, స్టంపింగ్స్ మిస్ చేయడం.. అలా కొంతకాలం సాగింది. కానీ తనను తాను మెరుగుపరుచుకుని విమర్శకుల నోరు మూయించాడు. 

‘‘నాణ్యత కీలకం. నిన్ను నీవు చురుగ్గా ఉంచుకోవాలి. వికెట్ కీపింగ్ లో భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చురుగ్గా ఉంటేనే అది సాయపడుతుంది. రెండోది బాల్ ను చివరి క్షణం వరకు చూడడం. కొన్ని సందర్భాల్లో వికెట్ కీపర్ గా బాల్ వస్తుందిలే అని తెలుసుకుని రిలాక్స్ అవుతాం. కానీ, బాల్ ను పట్టుకునే వరకు దాన్ని చూస్తూ ఉండాల్సిందే. ఇక మూడోది క్రమశిక్షణగా ఉంటూ, టెక్నిక్ లపై పనిచేయాలి. ప్రతి ఒక్కరికీ భిన్నమైన నైపుణ్యాలు ఉంటాయి" అని పంత్ వివరించాడు. 

ప్రతీ గేమ్ లోనూ 100 శాతం ఫలితాన్ని చూపించేందుకే తాను కష్టపడతానని పంత్ చెప్పాడు. తాను ఎప్పుడూ వికెట్ కీపర్ బ్యాట్స్ మ్యాన్ గా ఉండేందుకే ఇష్టపడతానన్నాడు. 

‘‘చిన్నప్పుడు నేను వికెట్ కీపింగ్ తోనే ఆట మొదలు పెట్టా. మా నాన్న కూడా వికెట్ కీపర్ గా ఉండేవారు. అలా నేను కూడా వికెట్ కీపింగ్ తో క్రికెట్ మొదలు పెట్టా’’ అని పంత్ తన వికెట్ కీపింగ్ కెరీర్ వెనుక నేపథ్యాన్ని వివరించాడు.

More Telugu News