Nupur Sharma: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను చంపేస్తామంటూ బెదిరింపులు

  • టీవీ చానల్ డిబేట్ లో నుపుర్ అనుచిత వ్యాఖ్యలు
  • తీవ్రంగా పరిగణించిన బీజేపీ
  • పార్టీ నుంచి సస్పెన్షన్ 
  • బెదిరింపులు రావడంతో పోలీసులను ఆశ్రయించిన నుపుర్
Death threats to Nupus Sharma

ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన ఫలితంగా నుపుర్ శర్మను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించడమే కాకుండా, పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేయడం తెలిసిందే. అయితే, నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తను అవమానించిందని, ఆమెను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. దాంతో ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. 

కాగా, టీవీ చానల్ డిబేట్ లో మహ్మద్ ప్రవక్తపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల నుపుర్ శర్మ క్షమాపణలు తెలియజేశారు. ఏ ఒక్కరి మతవిశ్వాసాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. అంతేకాదు, తన చిరునామాను బహిర్గతం చేయొద్దని, తన కుటుంబ భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే, బీజేపీ జారీ చేసిన ఓ ప్రకటనలో నుపుర్ చిరునామాను కూడా పేర్కొనగా, ఆ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో, తన చిరునామా అందరికీ తెలిసిపోతుందని, తన కుటుంబంపై దాడులు జరిగే అవకాశం ఉందని నుపుర్ భయపడుతున్నారు. 

నుపుర్ శర్మ మాత్రమే కాకుండా, బీజేపీ ఢిల్లీ మీడియా ఇన్చార్జిగా వ్యవహరించిన నవీన్ జిందాల్ కూడా మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసి తగిన మూల్యం చెల్లించుకున్నారు. నవీన్ జిందాల్ ను కూడా బీజేపీ సస్పెండ్ చేసింది. నుపుర్, నవీన్ జిందాల్ వ్యాఖ్యల ఫలితంగా ముస్లిం దేశాలు సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, ఇరాన్ మండిపడుతున్నాయి. మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.

More Telugu News