Spices: ప్రతీ ఇంట్లో ఉండాల్సిన సుగంధ ద్రవ్యాలు ఇవి..!

  • పసుపు, దాల్చిన చెక్క, మిరియాలు, మెంతులు
  • జీలకర్ర, లవంగం, సోంపు, నువ్వులు
  • వీటిల్లో సహజ ఔషధ గుణాలు మెండు 
  • ఎన్నో వ్యాధులకు వంటింటి పరిష్కారాలు
Spices that are must haves in your kitchen counter

సుగంధ ద్రవ్యాలు.. మన పూర్వీకులకు వీటి ప్రాధాన్యం గురించి బాగానే తెలుసు. కాకపోతే ఈ తరాల వారికే వీటి గురించి పెద్దగా తెలియడం లేదు. వీటిని మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఆయుర్వేదం వీటి ప్రాధాన్యం గురించి తెలియజేసింది. దినుసులన్నవి కేవలం రుచికోసమే కాదని, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా నేడు పరిశోధకులు కూడా అంగీకరిస్తున్నారు.

పుసుపు
అదృష్టం ఏమిటంటే భారత్ లో ప్రతి ఇంట్లో ఉండే వస్తువు ఇది. దాదాపు అందరూ దీన్ని వంటల్లో వాడుతుండడం మంచి విషయం. ఇందులో ఉండే కుర్కుమిన్ ను మంచి ఔషధంగా చెప్పుకోవచ్చు. యాంటీ వైరల్ గా ఇది పనిచేస్తుంది. వాపు గుణాలను కలిగించే ఎంజైమ్ లను తగ్గిస్తుంది. అంటే యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నందున.. వ్యాధులకు సహజ ఔషధంగా పనిచేస్తుంది. 

జీలకర్ర
వీటితో ఐరన్ లభిస్తుంది. దీంతో శరీర కణాలకు ఆక్సిజన్ చేరవేసేందుకు జీలకర్ర సాయపడుతుంది. శరీరం శక్తిని సంతరించుకోవడానికి ఆక్సిజన్ కీలకం. జీవక్రియలకు, వ్యాధి నిరోధక శక్తికి జీలకర్ర మేలు చేస్తుంది.

నల్ల మిరియాలు
వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. విటమిన్ సీ కూడా లభిస్తుంది. మంచి యాంటీబయోటిక్ గా కూడా పనిచేస్తుంది.

లవంగం
శ్వాసకోశ వ్యాధులను తగ్గించడానికి సాయపడుతుంది. గొంతు, అన్న వాహికలో పేరుకున్న కఫం విచ్చిన్నమవ్వడానికి సాయపడుతుంది. 

నువ్వులు
వీటిల్లో లిగ్నాన్స్ ఉంటాయి. ఇవి లివర్ ఎంజైమ్ ల పనితీరును పెంచుతాయి. మంచి ఫైబర్ లభిస్తుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గిస్తుంది. అంతేకాదు ఎముకలకు కావాల్సినంత పోషకం గుప్పెడు నువ్వులను నిత్యం తీసుకోవడం వల్ల అందుతుంది. 

సోంపు 
ఇది తెలియని వారు ఉండరు. ముఖ్యంగా హోటళ్లలో భోజనం తర్వాత దీన్ని ఆఫర్ చేస్తుంటారు. నోటికి సువాసనను అందిస్తుంది. తిన్న ఆహారం మంచిగా జీర్ణమయ్యేందుకు ఇది సాయపడుతుంది. అందుకే భోజనాననంతరం దీన్ని ఆఫర్ చేస్తుంటారు. రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గిస్తుంది. 

ఉల్లిగింజలు
కలోంజి అని కూడా అంటారు. వీటిల్లో థైమో క్వినోన్ ఉంటుంది. ఊపిరితిత్తుల్లో వాపును తగ్గించేందుకు ఔషధంగా పనిచేస్తుంది.

దాల్చినచెక్క
శరీరంలో ఎంజైమ్ లను చురుగ్గా మారుస్తుంది. మధుమేహ నియంత్రణకు, జలుబు, ఫ్లూపై ఔషధంగా పనిచేస్తుంది. 

మెంతులు
మధుమేహ నియంత్రణకు మెంతులు కూడా ఒక ఔషధం. ఇందులో ఉండే ఫైబర్ గ్లూకోజ్ ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ట్రై గ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు.. శరీరంలో అధికంగా ఉన్న నీటిని బయటకు పంపించడంలో సాయపడుతుంది.

More Telugu News