Tamil Nadu: మరణించాక ఏం జరుగుతుందో తెలుసుకోవాలని.. న్యాయ కళాశాల విద్యార్థి ఆత్మహత్య

  • చెన్నైలో ఘటన
  • ఊరు వెళ్లి వచ్చినప్పటి నుంచి ముభావంగా ఉంటున్న విద్యార్థి
  • తాను దాచుకున్న రూ. 5 వేలను తల్లికి అప్పగించాలని లేఖ
  • ఆత్మహత్యపై వేరే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు
What will happen after death Law student writes letter and committed suicide

మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఓ న్యాయ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. తిరునెల్వేలి జిల్లాకు చెందిన సల్మాన్ (19) చెన్నైలోని తరమణిలో ఉన్న లా కాలేజీలో రెండో సంవత్సరం చదువుతూ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం ఊరికి వెళ్లొచ్చిన సల్మాన్ అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు.

స్నేహితులతోనూ సరిగా మాట్లాడడం లేదు. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న సల్మాన్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. ఆత్మహత్యకు ముందు అతడు రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో అతడు.. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. తాను దాచిపెట్టిన రూ. 5 వేల నగదును అమ్మకు అప్పగించాలని అందులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు ఇంకేమైనా కారణం ఉందా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.

More Telugu News