Telangana: జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద హై టెన్ష‌న్‌... గ్యాంగ్ రేప్ నిందితుల‌పై చ‌ర్య‌ల‌కు బీజేపీ డిమాండ్‌

bjp cadre enters in to jublee hill police station
  • ఆమ్నేషియా ప‌బ్‌లో బాలిక‌పై గ్యాంగ్ రేప్‌
  • ఈ కేసులో హోం మంత్రి మ‌న‌వ‌డే కీల‌క నిందితుడ‌న్న ర‌ఘునంద‌న్ రావు
  • నిందితుల‌ను అరెస్ట్ చేయాలంటూ జూబ్లీ హిల్స్ పీఎస్ వ‌ద్ద బీజేపీ నిర‌స‌న‌
  • పోలీస్ స్టేష‌న్‌లోకి దూసుకెళ్లిన బీజేపీ శ్రేణులు
హైద‌రాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద శుక్ర‌వారం తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. న‌గ‌రంలోని ఆమ్నేషియా ప‌బ్‌లో చోటుచేసుకున్న గ్యాంగ్ రేప్ నిందితుల‌ను అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా పోలీసు సిబ్బందిని ప‌క్క‌కు తోసేసి బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేష‌న్‌లోకి ప్ర‌వేశించాయి. ఒక్క‌సారిగా వంద‌లాది మంది బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేష‌న్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఇదిలా ఉంటే.. గ్యాంగ్ రేప్‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి మ‌న‌వ‌డే కీల‌క నిందితుడ‌ని బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు ఆరోపించారు. నిందితుడు హోం మంత్రి మ‌న‌వ‌డు కావ‌డంతో అత‌డిపై కేసు న‌మోదు చేసేందుకు పోలీసులు వెనుకాడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇక పోలీస్ స్టేష‌న్ వద్ద‌కు వ‌చ్చిన బీజేపీ శ్రేణుల‌కు నేతృత్వం వ‌హించిన మాజీ ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డి కూడా ఇదే త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేశారు. త‌క్ష‌ణ‌మే నిందితుల‌ను అరెస్ట్ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.
Telangana
Hyderabad
Jubilee Hills PS
BJP
Raghunandan Rao
Chintala Ramachandra Reddy

More Telugu News