Muhammad Rizwan: భారత్-పాక్ జట్లు పోరాటానికి సిద్ధం.. కానీ..: పాక్ క్రికెటర్ రిజ్వాన్

  • ద్వైపాక్షిక వ్యవహారాలు తమ చేతుల్లో ఉండవన్న రిజ్వాన్
  • చటేశ్వర్ పూజారా నుంచి ఎన్నో నేర్చుకున్నట్టు ప్రకటన
  • ఆటపట్ల అతడి ఏకాగ్రత మెచ్చుకోవాల్సిందేనన్న పాక్ క్రికెటర్
India and Pakistan cricketers want to play against each other Muhammad Rizwan

భారత్, పాకిస్థాన్ జట్లు కలిసి ఆడాలని కోరుకుంటున్నట్టు పాకిస్థాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ ప్రకటించాడు. కానీ, రెండు దేశాల మధ్య సంబంధాలు తమ చేతుల్లో లేవని పేర్కొన్నాడు. 2013 జనవరి నుంచి భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య ఇప్పటి వరకు ద్వైపాక్షిక సిరీస్ ఒక్కసారి కూడా జరగలేదు. చివరిగా పాకిస్థాన్ జట్టే భారత్ లో పర్యటించి వెళ్లింది. ఇక ద్వైపాక్షిక టెస్ట్ మ్యాచ్ లు అయితే 2007-08 సీజన్ తర్వాత ఇంత వరకు సాధ్యపడలేదు. కేవలం ప్రపంచకప్, ఆసియా కప్పుల్లోనే తలపడుతున్నాయి.

‘‘పాకిస్తాన్, భారత్ క్రికెటర్లు ఒకరితో మరొకరు పోటీ పడాలని కోరుకుంటున్నారు. కానీ, దేశాల మధ్య సంబంధాలు వారి నియంత్రణలో ఉండేవి కావు’’ అని రిజ్వాన్ పేర్కొన్నాడు. భారత క్రికెటర్ చటేశ్వర్ పుజారాను ఈ సందర్భంగా రిజ్వాన్ మెచ్చుకున్నాడు. రిజ్వాన్, పుజారా ఇంగ్లండ్ లోని సస్సెక్స్ కంట్రీక్లబ్ ఛాంపియన్ షిప్ కోసం ఇటీవలే కలిసి ఆడారు.

‘‘పుజారాతో క్రికెట్ గురించి చర్చించాను. అతడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆటగాళ్లుగా మా మాధ్య ఎలాంటి భేదాలు లేవు. మేమంతా ఒకే క్రికెట్ కుటుంబం. పుజారా ఏకాగ్రత, ఆట పట్ల దృష్టి కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఈ విషయంలో యూనిస్ ఖాన్, ఫవాద్ ఆలమ్, చటేశ్వర్ పుజారాను నేను ఎంతో గౌరవిస్తా’’ అని రిజ్వాన్ ఓ వార్తా సంస్థతో చెప్పాడు.

More Telugu News