heart diseases: చిన్న వయసుల్లోనే ఎందుకు ఇన్నేసి గుండె వైఫల్యాలు?

  • మారిన జీవనశైలి, ఆహారం, ఒత్తిడులు
  • తగినంత నిద్ర లేకపోవడం కూడా రిస్కే
  • నిశ్చలంగా, కదలికల్లేని జీవనం గుండెకు పెద్ద ముప్పు
  • కరోనా చేసిన నష్టం కూడా ఒక కారణం
Why are young Indians increasingly dying of heart diseases

ప్రముఖ గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నత్) మరణంతో చిన్నబోతున్న చిన్ని గుండెల అంశం మరోసారి చర్చకు వచ్చింది. కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్, ఏపీ మంత్రిగా చేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే గుండె వైఫల్యాలతో మరణించిన వారితో పెద్ద జాబితానే అవుతుంది. 40-50 ఏళ్లకే గుండెపోటు ఎంతో మందిని నేడు బలి తీసుకుంటోంది. మన దగ్గర ఈ కేసులు పెరిగిపోవడానికి గల కారణాలపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..

కారణాలు..
చలనం లేని జీవనశైలి. అంటే పెద్దగా కదలికలతో పని లేకుండా అస్తమానం కూర్చుని చేసే ఉద్యోగం, వ్యాపారాలు. శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, పొగతాగే అలవాటు, దీనికితోడు మద్యపానం, తగినంత నిద్ర లేకపోవడం, పోషకాహారం లోపించడం.. వీటికి తోడు రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. 

గణాంకాలు.. 
40 ఏళ్లలోపు ఈ తరహా కేసులు గత 20 ఏళ్లలో రెట్టింపు అయ్యాయంటే ఎంత రిస్క్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇటీవలి గ్లోబల్ బర్డెన్ స్టడీ నివేదికను గమనిస్తే.. భారత్ లో ప్రతి లక్ష మందిలో 272 మంది గుండె సంబంధిత సమస్యలతో చనిపోతున్నారు. అంతర్జాతీయంగా ఇది 232గానే ఉంది. దేశంలో 25-69 వయసులో నమోదవుతున్న మొత్తం మరణాల్లో 24.8 శాతం గుండె సంబంధిత సమస్యల వల్లేనని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

కార్డియాక్ అరెస్ట్
మయోకార్డియల్ ఇన్ ఫ్రాక్షన్ ను హార్ట్ ఎటాక్ గా చెబుతారు. కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ రెండూ వేర్వేరు. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోవడం. కానీ, హార్ట్ ఎటాక్ లో వ్యక్తి ఇంకా శ్వాస తీసుకుంటూనే ఉంటాడు, గుండె స్పందనలు నడుస్తుంటాయి. హార్ట్ ఎటాక్ లో వేగంగా చర్యలు తీసుకోనప్పుడు హార్ట్ అరెస్ట్ అవుతుంది. 

ఆరోగ్యకరమైన గుండె కోసం..
ఆరోగ్యానికి అనుకూలమైన జీవన విధానం, కొవ్వులు తగ్గించి, తక్కువ కేలరీలతో  కూడిన పోషక ఆహారం, చేస్తున్న వ్యాయామాలు, ఒత్తిడి తగ్గించుకోవడం ఇవే గుండె సమస్యల బారిన పడకుండా లేదా రిస్క్ తగ్గించుకునే మార్గాలని వైద్యుల సూచన. యువకుల్లో గుండె పోట్లకు పొగతాగడం ప్రధాన కారణంగా ఉంటోందని అంటున్నారు. శారీరక వ్యాయామాలు ప్రారంభించే ముందు కార్డియాలజిస్ట్ వద్ద చెకప్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ వయసు అయినా కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార నియమాలు, వ్యాయామాలతో గుండె జబ్బుల రిస్క్ తగ్గించుకోవచ్చు. 

కొన్ని రకాల ఔషధాలు కూడా దీర్ఘకాలం పాటు తీసుకున్న సందర్భాల్లో గుండెకు నష్టం చేస్తాయి. ఇది అరిథిమియాకు (ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్) దారితీయవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే, గుండె కండరాలు గట్టిపడినప్పుడు, గుండె సెల్స్ లో మార్పులు చోటు చేసుకున్నప్పుడు గుండె ఎలక్ట్రికల్ సిస్టమ్ లో మార్పులు వస్తాయి. ఇది ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ కు దారితీస్తుంది. దీన్నే అట్రియల్ ఫిబ్రిలేషన్ అని కూడా చెబుతారు. దీనివల్ల రక్తంలో క్లాట్స్ ఏర్పడి గుండెపోటు లేదా స్ట్రోక్ సమస్య ఏర్పడవచ్చు. 

కరోనా సైతం..
ఇక ఇటీవలి కాలంలో గుండె వైఫల్యాల వెనుక కరోనా వైరస్ చేసిన డ్యామేజ్ కూడా ఒక కారణమని వైద్యులు చెబుతున్నారు. స్వల్ప స్థాయిలో కరోనా బారిన పడినవారిలోనూ గుండె సంబంధిత సమస్యలు వెలుగు చూస్తున్నాయి. ఇక కరోనాతో ఐసీయూలో చేరి, దీర్ఘకాలం పాటు చికిత్సలు తీసుకున్న వారికి గుండె జబ్బుల రిస్క్ మరింత పెరిగింది. కనుక కరోనా బారిన పడి కోలుకున్న వారు ఏడాదికోసారి అయినా వైద్య పరీక్షలకు వెళ్లాలి.

More Telugu News