India: ఏడాది తర్వాత ఆఫ్ఘన్ లో అడుగుపెట్టిన భారత బృందం... తాలిబన్లతో భేటీ

  • ఆఫ్ఘనిస్థాన్ లో నిరుడు తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు
  • ఆ వెంటనే భారత్ కు వచ్చేసిన మన దౌత్య సిబ్బంది 
  • ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ లో క్షీణిస్తున్న పరిస్థితులు
  • సాయం అందించాలని భారత్ నిర్ణయం
Indian contingent met Taliban leaders in Kabul

గతేడాది ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు పగ్గాలు చేపట్టాక అక్కడి నుంచి భారత దౌత్య సిబ్బంది వెనక్కి వచ్చేశారు. అమెరికా సేనలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి నిష్క్రమించడంతో ఇక అక్కడ ఉండడం క్షేమకరం కాదని భావించిన అనేక దేశాల దౌత్య సిబ్బంది, సాధారణ ప్రజలు కూడా దేశాన్ని విడిచారు. భారత దౌత్య సిబ్బంది కూడా ప్రత్యేక విమానంలో భారత్ వచ్చేశారు. ఈ నేపథ్యంలో, ఏడాది తర్వాత భారత బృందం మళ్లీ ఆఫ్ఘన్ గడ్డపై అడుగుపెట్టింది. కాబూల్ లో భారత అధికారుల బృందం నేడు తాలిబన్ ప్రతినిధులను కలిసింది. 

దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి స్పందించారు. "ఆఫ్ఘనిస్థాన్ లో భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గతేడాది ఆగస్టు 15 తర్వాత భారత్ కు చెందిన సిబ్బందిని అక్కడ్నించి వెనక్కి తీసుకువచ్చాం. అయితే, ఆఫ్ఘన్ జాతీయులైన స్థానిక సిబ్బంది మాత్రం భారత దౌత్య కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆఫ్ఘన్ ప్రజలతో భారత్ సుదీర్ఘకాలంగా చారిత్రాత్మక, సాంస్కృతికపరమైన సంబంధాలు కలిగి ఉంది. ఆఫ్ఘనిస్థాన్ పట్ల భారత్ దృక్పథానికి ఆ సంబంధాలే మార్గదర్శనం చేస్తున్నాయి. అందుకే భారత బృందం తాలిబన్ ప్రభుత్వంలోని సీనియర్ నేతలను కలుస్తోంది. ఆఫ్ఘన్ ప్రజలకు భారత్ అందించే మానవీయ సాయంపై వారు చర్చిస్తారు" అని వివరించారు. 

కాగా, ఆఫ్ఝన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లను భారత్ అధికారికంగా గుర్తించకపోవడం తెలిసిందే.

More Telugu News