Rajasthan Congress: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.. రాజస్థాన్ లో రిసార్టులకు ఎమ్మెల్యేల తరలింపు

  • అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ఎత్తులు
  • ప్రత్యర్థి పార్టీలకు ఓట్లు వెళ్లకుండా రక్షణాత్మక చర్యలు
  • రెండు పార్టీలకూ మిగులు ఓట్లు
  • ఇతర పార్టీల ఓట్లతో అదనపు సీటు గెలవాలన్న ప్రయత్నాలు
Rajasthan Congress bjp to shift MLAs to hotel ahead of RS polls on June 10

కీలకమైన రాజ్యసభ ఎన్నికల ముందు రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డాయి. తమ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు వారిని ఉదయ్ పూర్ లోని ఆరావళి రిసార్ట్ కు తరలించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. జూన్ 10న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం తమ ఎమ్మెల్యేలను బీజేపీ తన్నుకుపోవచ్చన్న భయమే దీనికి కారణమని పార్టీ వర్గాలు తెలిపాయి.

జైపూర్ లోనే క్లార్క్ హోటల్ లో ఎమ్మెల్యేలకు శిక్షణా కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టింది. అది ముగిసిన వెంటనే జూన్ 2న వారిని ఆరావళి రిసార్ట్ కు తీసుకెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తున్న స్వతంత్రులు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను సైతం కాంగ్రెస్ హోటళ్లకు తరలించనుంది. 

మరోవైపు బీజేపీ కూడా ఇదే మార్గాన్ని అనుసరించనుంది. శుక్రవారం తన పార్టీ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించే ప్రయత్నాల్లో వుంది. రాజస్థాన్ లో బీజేపీకి 71 సభ్యుల బలం ఉంది. 41 మంది సభ్యులతో ఒక సీటును బీజేపీ గెలుచుకోగలదు. కానీ, ఇక్కడి నుంచి ఇద్దరిని బరిలోకి దింపింది. దీంతో ఆ పార్టీకి మరో 11 మంది మద్దతు అవసరం. ఇదే ప్రత్యర్థి పార్టీల వెన్నులో వణుకు తెప్పిస్తోంది. స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతు పొందాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇదే మాదిరి ఉంది. 108 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇద్దరిని సునాయాసంగా గెలిపించుకోగలదు. తర్వాత మరో 26 మంది సభ్యుల బలం మిగిలి ఉంటుంది. మరో స్థానం గెలుచుకోవాలంటే 15 మంది మద్దతు కూడగట్టాలి. మరోవైపు హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సైతం రాజస్థాన్ జైసల్మేర్ లోని సూర్యాగఢ్ లో హోటల్ కు తరలించనున్నారు.

More Telugu News