Ambati Rambabu: పోల‌వ‌రం ఎప్పుడు పూర్తవుతుందో చెప్ప‌లేం: మంత్రి అంబ‌టి రాంబాబు

  • టీడీపీ చారిత్ర‌క త‌ప్పిదం వ‌ల్లే డ‌యాఫ్రం వాల్ దెబ్బ తిందన్న అంబటి 
  • కాఫ‌ర్ డ్యాం క‌ట్ట‌కుండా డ‌యాఫ్రం వాల్ క‌ట్ట‌డం త‌ప్పిద‌మేనని వ్యాఖ్య 
  • దీనిపై చంద్ర‌బాబు, దేవినేని ఉమ చ‌ర్చ‌కు రావాలని సవాల్ 
  • తొలి ద‌శ పూర్తి చేయ‌డానికి శాయ‌శ‌క్తులా య‌త్నిస్తున్నామ‌న్న మంత్రి  
ap minisret ambati rambabu says there is no time gramefor polavaram project

ఏపీ జీవ‌నాడిగా ప‌రిగ‌ణిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్ప‌లేమంటూ ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు వ్యాఖ్యానించారు. అస‌లు ఈ ప్రాజెక్టు పూర్తికి గ‌డువు అన్న‌దే లేద‌ని కూడా స్ప‌ష్టం చేశారు. ఏ ప్రాజెక్టు అయినా ద‌శ‌ల‌వారీగానే పూర్తవుతుంద‌ని, తొలి ద‌శ‌ను పూర్తి చేయ‌డానికి శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నామని తెలిపారు.

బుధ‌వారం ధ‌వ‌ళేశ్వ‌రం కాట‌న్ బ్యారేజీ వ‌ద్ద గోదావ‌రి డెల్టాకు నీటిని విడుద‌ల చేసిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ హ‌యాంలో జ‌రిగిన చారిత్ర‌క త‌ప్పిదం వ‌ల్ల‌నే డ‌యాఫ్రం వాల్ దెబ్బ తిన్న‌ద‌ని ఆయ‌న ఆరోపించారు. 

పోల‌వ‌రం ప్రాజెక్టులో కీల‌క నిర్మాణంగా ఉన్న డ‌యాఫ్రం వాల్ ఎవ‌రి చర్య వ‌ల్ల దెబ్బ తిన్న‌దో దానిపై చ‌ర్చ జ‌ర‌గాల‌ని అంబ‌టి పేర్కొన్నారు. దీనిపై చ‌ర్చ‌కు రావాల‌ని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు, జ‌ల‌వ‌న‌రుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుల‌కు ఆయ‌న స‌వాల్ చేశారు. ఇంజినీర్లు, మేథావులు, మీడియా ప్ర‌తినిధుల స‌మ‌క్షంలో ఈ చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

కాఫ‌ర్ డ్యాం క‌ట్ట‌కుండా డ‌యాఫ్రం వాల్ క‌ట్ట‌డం వ‌ల్లే న‌ష్టం జ‌రిగింద‌ని అంబ‌టి తెలిపారు. ఇలా చేయడం చారిత్ర‌క త‌ప్పిద‌మేన‌న్నారు. తిరిగి డ‌యాఫ్రం వాల్‌ను కొత్త‌గా నిర్మించాలా? లేదంటే దెబ్బ తిన్న‌దానికే మ‌ర‌మ్మ‌తులు చేయాలా? అన్న దానిపై దేశంలోని మేథావులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ని అంబ‌టి చెప్పారు.

More Telugu News